New Delhi, February 3: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వివాదాస్పద వ‌్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రైతుల ఆందోళనపై (Farmers Protest) పార్లమెంట్‌లో 15 గంటల పాటు చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం ప్రతిపక్షాలతో సమావేశమైన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్చ రాజ్యసభలో జరగనుంది. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తర్వాత ఈ చర్చ జరపనున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు.
దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో నినాదాలు చేశాయి. ముగ్గురు ఆమ్ ఆద్మీ సభ్యులు పదేపదే నినాదాలు చేయడంతో వాళ్లను సభ నుంచి బయటకు పంపించేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కు చెందిన ఎంపీలు సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్డీ గుప్తాలను సభ నుంచి ఈ రోజంతా బహిష్కరించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు జీరో అవర్ అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించడానికి ప్రయత్నించారు.
అయితే ఇంతలో ముగ్గురు ‘ఆప్’ ఎమ్మెల్యేలు తమ సీట్లలో నుంచి లేచి నిలుచుని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించే సమయంలో రైతుల అంశం లేవదీసి గందరగోళం సృష్టించి, సభకు ఆటంకం కలిగించడం తగదన్నారు. అయినా కూడా ఆ ముగ్గురు ఎంపీలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన ఆ ముగ్గురు ఎంపీలను ఈ రోజంతా సభ నుంచి బహిష్కరించారు.
కాగా కేవలం రైతుల ఆందోళనలపైనే ఐదు గంటల పాటు చర్చ జరపాలని 16 ప్రతిపక్ష పార్టీలు (Opposition Parties) పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం దానిని 15 గంటలకు పెంచడానికి అంగీకరించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో ప్రకటన చేశారు. చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు.