Farmers’ Protest Updates: రాకేశ్‌ టికయిత్‌ భావోద్వేగ పిలుపు, మళ్లీ ఊపందుకున్న రైతు ఉద్యమం, తోడవుతున్న అన్ని రాష్ట్రాల రైతులు, ఘాజీపూర్‌ కేంద్రంగా రైతులు నిరసన, చర్చలకు ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నామని తెలిపిన ప్రధాని మోదీ
Farmers' Protest Visuals from Ghazipur Border (Photo Credits: ANI)

New Delhi, January 31: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనోద్యమం (Farmers’ Protest Updates) మళ్లీ ఊపందుకున్నది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్‌ పరేడ్‌లో హింస చోటుచేసుకున్న తర్వాత కొంత బలహీనపడినట్లు కనిపించిన రైతు పోరాటం (Farmers Protest) మళ్లీ మెల్లిగా ఊపందుకుంది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) సారథ్యం వహిస్తున్న ఢిల్లీ-మీరట్‌ హైవేలోని ఘాజీపూర్‌ ప్రాంతంలో (Delhi Borders) ప్రస్తుతం రైతులు ఉద్యమిస్తున్నారు. బీకేయూ నేత రాకేశ్‌ టికయిత్‌ ఇచ్చిన భావోద్వేగ పిలుపుకు రైతులు కదిలారు. ఆయన పిలుపు ఉద్యమానికి కొత్త జవసత్వాలు అందించింది.

ఈ నేపథ్యంలో పశ్చిమ యూపీ, పంజాబ్‌, హర్యానా నుంచి పెద్ద ఎత్తున రైతులు ఘాజీపూర్‌కు తరలివస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌పాటు సమీప ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ప్రధానంగా పంజాబ్, హరియాణా రైతులే ఇప్పటివరకు ఈ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తుండగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్‌ రైతులు కూడా తోడవుతున్నారు.

ఢిల్లీలో హింస తర్వాత స్వస్థలాలకు తిరిగి వెళ్లిన పంజాబ్, హరియాణా రైతులు మళ్లీ వెనక్కి వస్తున్నారు. సింఘు, టిక్రీ బోర్డర్‌ పాయింట్లకు చేరుకుంటున్నారు. రైతుల నిరసన కేంద్రాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పారా మిలటరీ దళాలను మోహరించారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులోని ముజఫర్‌నగర్‌లో శనివారం మహాపంచాయత్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

ఢిల్లీలో హింస, జనవరి 31వ తేదీ వరకు మళ్లీ ఎర్రకోట మూసివేత, ఉత్తర్వులు జారీ చేసిన పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా, పార్లమెంట్ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రైతులు

గాంధీజీ వర్ధంతి సందర్భంగా రైతు నేతలు శనివారం సద్భావన దినంగా పాటించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేశారు. ఘాజీపూర్‌ వద్ద రాకేశ్‌ టికయిత్‌ మాట్లాడుతూ.. సాగు చట్టాలపై రెండు నెలలుగా పోరాటం సాగిస్తున్నామని, ఇకపైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం నాటికి రికార్డుస్థాయిలో రైతులు సరిహద్దులకు చేరుకుంటారని రైతు నేత బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌ చెప్పారు. మరోవైపు, ఉద్యమం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన భారతీయ కిసాన్‌ యూనియన్‌ లోక్‌శక్తి వర్గం తిరిగి ఉద్యమంలో చేరుతున్నట్టు వెల్లడించింది.

రైతుల ఉద్యమాన్ని కించపరిచేందుకు బీజేపీ రచించిన స్క్రిప్ట్‌ ప్రకారమే రిపబ్లిక్‌ డే హింసాకాండ చోటుచేసుకున్నదని ఆమ్‌ఆద్మీపార్టీ ఆరోపించింది. బీజేపీ నేతలే జాతివ్యతిరేకులని, వారిపై దేశద్రోహం కేసులు నమోదుచేసి ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌చేసింది. నూతన వ్యవసాయ చట్టాలు.. కనీస మద్దతు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, మండీ వ్యవస్థను బలహీనపరుస్తాయని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు సంఘీభావంగా శనివారం బీహార్‌వ్యాప్తంగా ప్రతిపక్ష మహాకూటమి నేతలు, కార్యకర్తలు మానవహారాలు ఏర్పాటుచేశారు.

రైతు ఉద్యమంలో చీలికలు, ఈ నిరసన నుంచి తప్పుకుంటున్నామని తెలిపిన ఏఐకేఎస్‌సీసీ, శాంతియుత నిరసన కొనసాగిస్తామని తెలిపిన వీఎం సింగ్, రాకేష్ తికాయత్‌తో సహా 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రైతుల ఆందోళన నానాటికీ బలం పుంజుకుంటోందని సంయుక్త కిసాన్‌ మోర్చా సీనియర్‌ సభ్యుడు అభిమన్యు కోహర్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంతోమంది తమ పోరాటంలో భాగస్వాములవుతారని చెప్పారు. ఫిబ్రవరి 2వ తేదీ నాటికి భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీకి చేరుకుంటారని అంచనా వేస్తున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌(రాజేవాల్‌) అధ్యక్షుడు బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌ పేర్కొన్నారు. ఆయన చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌ నుంచి రికార్డు స్థాయిలో రైతులు దేశ రాజధానికి వస్తారని వెల్లడించారు.

తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతోందని.. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడం దారుణమని విమర్శించారు. జనవరి 26 నాటి హింసాత్మక దృశ్యాలను ప్రభుత్వం పదేపదే చూపుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని రాజేవాల్‌ మండిపడ్డారు. కేంద్ర సర్కారు ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలని, కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని హితవు పలికారు. మళ్లీ చర్చల కోసం ప్రభుత్వం పిలిస్తే తప్పకుండా వెళ్తామన్నారు. ఢిల్లీలో జరిగిన హింసపై పోలీసులు జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇస్తామని చెప్పారు.

ఢిల్లీలో ట్రాక్టర్ కింద పడి రైతు మృతి, తీవ్ర హింసాత్మకంగా మారిన ట్రాక్టర్ల ర్యాలీ, దేశ రాజధానిలో ఇంటర్నెట్, మెట్రో సేవలు బంద్

రిపబ్లిక్‌ డే రోజు రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో హింసాకాండపై ప్రజల నుంచి పోలీసులకు ఇప్పటిదాకా 1,700 వీడియో క్లిప్స్, సీసీటీవీ ఫుటేజీ అందాయి. ఫోరెన్సిక్‌ నిపుణులు వీటిని విశ్లేషిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ హింసాకాండకు సంబంధించి 9 కేసులు నమోదుచేశారు. వీటిపై క్రైం బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తోంది. ఫోన్‌ కాల్స్‌ డేటాను పరిశీలిస్తున్నారు. ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాక్టర్‌ పరేడ్‌ను 9 డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. వీటిపై అధికారులు దృష్టి పెట్టారు.

దేశ రాజధానిలో జనవరి 26న హింస చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా ఢిల్లీ సరిహద్దులోని రైతుల నిరసన కేంద్రాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్‌ పాయింట్లతోపాటు సమీప ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. జనవరి 29 రాత్రి 11 గంటల నుంచి 31వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హరియాణా ప్రభుత్వం 14 జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను ఇప్పటికే రద్దు చేసింది.

ఎవరీ దీప్ సిద్దూ.. రైతులను ఎందుకు రెచ్చగొట్టాడు, బీజేపీకి అతనికి సంబంధం ఏంటి ? ఎర్రకోటపై జెండాను ఎందుకు ఎగరవేశాడు, సిద్దూ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, రైతు మృతికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజి విడుదల

దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఘటన అనంతరం పెద్ద ఎత్తున రైతులు కనిపించకుండా పోయారనే వార్త దుమారం రేపుతోంది. ఈ మేరకు పంజాబ్‌ హూమన్‌ రైట్స్‌ సంస్థ శనివారం చేసిన ఓ ప్రకటన వివాదాస్పదంగా మారింది. ఈ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అభిప్రాయం ప్రకారం.. జనవరి 26 అనంతరం రాష్ట్రానికి చెందిన చాలామంది రైతు నిరసన కారులు అదృశ్యమయ్యారు. ఢిల్లీ హింసలో పాల్గొన్న దాదాపు 100 మంది రైతులు నాలుగు రోజులుగా కనిపించడంలేదని ఈ సంస్థ పేర్కొంది. ఈ మేరకు పంజాబ్‌ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 12 మంది రైతులు మిస్‌ అయ్యిన్నట్లు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైందని తన రిపోర్టులో తెలిపింది.

మరోవైపు నిరసనల్లో పాల్గొన్న 200 మంది రైతులపై కేంద్ర ప్రభుత్వం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పలువురిపై దేశద్రోహ కేసు కూడా నమోదు చేసింది. అయితే కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత న్యాయ సేవలను అందించాలని పలు సంఘాలకు చెందిన ప్రముఖులు నిర్ణయించారు. ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న వారి తరఫున ఉచితంగా వాదనలు వినిపిస్తామని ప్రకటించారు.

కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రైతు సంఘాలకు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఫోన్‌కాల్‌ దూరంలోనే ఉందన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం శనివారం వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు.

రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తుంది. జనవరి 22వ తేదీన రైతులతో జరిగిన చర్చల సందర్భంగా ఏడాదిన్నరపాటు కొత్త సాగు చట్టాల అమలును నిలిపివేస్తామంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఫోన్‌కాల్‌ చేస్తే చాలు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు వ్యవసాయ మంత్రి తోమర్‌ సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన బల్వీందర్‌ సింగ్, శివసేన నేత వినాయక్‌ రౌత్, టీఎంసీ నేత బంధోపాధ్యాయ్‌ రైతు ఆందోళనలను ప్రస్తావించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ అంశాన్ని చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీఎంసీ నేత బంధోపాధ్యాయ్‌ కోరారు.