Farmers’ Protest: ఎంఎస్పీపై చర్చకు తావు లేదు, విభేదించే వారితో చర్చలకు సిద్ధంగా ఉన్నాం, రైతులను పక్కదారి పట్టించవద్దు, ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టిన ప్రధాని మోదీ
PM Narendra Modi (Photo Credits: ANI/Twitter)

New Delhi, December 25: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్న (Farmers’ Protest) సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అంశంపై చర్చకు అసలు తావే లేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసలు చేస్తున్న రైతులకు మద్దతిస్తున్న విపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

రైతు చట్టాలపై (Farm Laws) తమతో విభేదించే వారితో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాజకీయాలు చేసే పార్టీలతో తమకు ఎలాంటి సమస్యా లేదని అయితే రైతులను తప్పదారి పట్టించవద్దని విపక్షాలను ఆయన కోరారు. తాజా వ్యవసాయ చట్టాలకు పలు పార్టీలు ఇంతకుముందు మద్దతు పలికాయి. దానిపై మా వద్ద లిఖతపూర్వక సాక్ష్యాలున్నాయి. ఇప్పుడు ఏ స్వార్థంతో వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.

ఒక రాజకీయ నేత ప్రజలను తప్పదారి పట్టిస్తున్నాడు. ఆయనకు కనీసం ప్రజాస్వామ్యంపై కూడా నమ్మకం లేదు. ఆయనకు విదేశాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇవన్నీ అలా ఉంచితే, రైతు అంశాలపైనే కాకుండా, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారితో అంశాలు, నిజాలు, లాజిక్‌ల ప్రాతిపదికగా చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని మోదీ తెలిపారు. మాకు మాత్రమే జ్ఞానం ఉందని మేము చెప్పడం లేదు. చర్చిద్దాం. ప్రజాస్వామ్యం అప్పుడే పరిఢవిల్లుతుంది. అన్ని అంశాలపైన అరమరికలు లేకుండా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని ప్రధాని తెలిపారు.

రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ నిధి కింద రూ.18 వేల కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, 9 కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ మొత్తం

సొంత రైతులనే వంచించిన ఒక రాజకీయ పార్టీ పంజాబులో రైతులను రెచ్చగొడుతోందని, వారు రాజకీయ ఔచిత్యాన్ని కోల్పోయారని మోదీ విమర్శించారు. ఇటీవల ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో రైతు నిరసనలకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. కొత్త చట్టాలపై రైతులకు కొన్ని భయాలున్నాయని, అయితే కొందరు రాజకీయ ఎజెండాతో మధ్యలోకి వచ్చి పొంతనలేని డిమాండ్లను తెరపైకి తెచ్చారని విపక్షాలను ప్రధాని తప్పుపట్టారు. మొదట్లో కనీస మద్దతు ధర డిమాండ్ మాత్రమే ఉండేదని, రైతులు కాబట్టి ఆ డిమాండ్ న్యాయసమ్మతమేనని ప్రధాని అన్నారు. ఇప్పుడు వారు కొందరిని జైళ్ల నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని, హైవైల్లో టోల్-ఫ్రీ డిమాండ్ కూడా తెరపైకి తెస్తున్నారని మోదీ తప్పుపట్టారు.

ఇదిలా ఉంటే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అంశంపై చర్చకు అసలు తావే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ’సాగు చట్టాలతో ధరల నిర్ణాయక వ్యవస్థ (ఎంఎస్పీ)కు ఎలాంటి సంబంధమూ లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫిక్స్‌డ్‌ రేటుకు పంట ఉత్పత్తుల సేకరణపైన కూడా వీటి ప్రభావం ఉండదు. చట్టాల ఉద్దేశమే వేరు. ఈ విషయాన్ని ఎన్నోమార్లు మీకు తెలియజేశాం. అయినప్పటికీ ఎంఎస్పీపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చట్టాల పరిధిలో లేని ఎంఎస్పీ గురించిన ఏ డిమాండ్‌నైనా చర్చల్లో చేర్చడం సాధ్యం కాదు’ అని రైతులకు తాజాగా రాసిన లేఖలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ తేల్చిచెప్పారు.

కాగా ప్రభుత్వం నిర్దిష్టమైన, ఖచ్చితమైన ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఎంఎస్పీని చట్టబద్ధం చేసే ఆలోచన ఉంటేనే చర్చకు వస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా పేరిట ఏర్పాటైన 35 రైతు సంఘాలు బుధవారం కేంద్రానికి స్పష్టం చేయడంతో వివేక్‌ అగర్వాల్‌ ఈ సమాధానం పంపారు. ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫారసు ప్రాతిపదికగా ఎంఎస్పీకి లీగల్‌ గ్యారంటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. .. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసిన సీ2+50శాతం ఫార్ములాను అమలు చేయాలని వారు కోరుతున్నట్లు సమాచారం. ఎంఎస్పీ విషయమై కమిషన్‌ చేసిన మరో రెండు సిఫారసులు - ఏ2, ఏ2+ఎఫ్ఎల్‌ లలో రెండోది అంటే ఏ2+ ఎఫ్‌ఎల్‌ను మెజారిటీ పంటల ఎంఎస్పీ ఽనిర్ణయానికి వాడుతోందన్నది రైతుల అభియోగం.

ఏ2 అంటే విత్తనాలు, ఎరువులు-రసాయనాలు, కూలీల ఖర్చు, ఇంధనం, సాగునీటికి అయ్యే వ్యయం, ఎఫ్‌ఎల్‌ అంటే కుటుంబ శ్రమ... ఈ రెండింటినీ కలుపుకుంటే వచ్చే ఖర్చు అంటే ఓ రకంగా ఓ రైతు పంట పండించడానికి అయ్యే మామూలు ఖర్చును అటూఇటూగా ఓ లెక్క వేసి ఇస్తున్నారని, ఇది ఏ మూలకూ సరిపోవడం లేదని రైతులతో పాటు వ్యవసాయ నిపుణులు అంటున్నారు. సీ2+50 శాతం ప్రకారం ఇవ్వమని తామడిగితే ఏ2 ప్రకారం ఇస్తున్నారని, 50 శాతం హెచ్చువేసి ఇస్తున్నట్లు, రైతులకు ఎంతో లాభం చేకూరుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోందని రైతులు విమర్శిస్తున్నారు.

ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన ఉధృతంగా సాగుతున్న సమయంలో- శుక్రవారం పీఎం కిసాన్‌ నిధి కింద తదుపరి విడత మొత్తాన్ని రైతుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ చేశారు. 9 కోట్ల మంది రైతులకు రూ 2000 చొప్పున జమ కానున్నాయి. గతంలో మామూలుగానే జమ చేసినా.. ఈసారి మాత్రం బటన్‌ నొక్కడం ద్వారా మొత్తాన్ని జమ చేయడం, ప్రత్యక్షప్రసారం చేశారు.