FASTag Update: రేపటి నుంచి ఫాస్టాగ్ అమ‌ల్లోకి, ఫాస్టాగ్ ఉంటేనే వాహనాలు హైవేల‌పైకి..లేకుంటే రెట్టింపు టోల్ చెల్లించాల్సిందే, ఫాస్టాగ్ ఎక్క‌డ కొనాలి? ఎలా రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి
Fastag (Photo Credits: Twitter)

New Delhi, Feb 14: భారతదేశ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ఫాస్టాగ్ అమ‌ల్లోకి (FASTag Update) రానుంది. ఇకపై వాహ‌నాల‌కు ఫాస్టాగ్ ఉంటేనే హైవేల‌పైకి ఎక్కాలి. లేదంటే డబుల్ టోల్ చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్ప‌టికే పలుమార్లు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి (FASTags Mandatory) వినియోగాన్ని వాయిదా వేస్తూ వ‌చ్చిన ప్ర‌భుత్వం సోమ‌వారం నుంచి దీన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. మరి ఈ ఫాస్టాగ్ ఎక్క‌డ కొనాలి? ఎలా రీఛార్జ్ చేయాలో ఒక‌సారి చూద్దాం.

మీ కారు కోసం ఫాస్టాగ్ కొనాలంటే నేరుగా టోల్ ప్లాజాల దగ్గర తీసుకోవచ్చు. అక్క ఫాస్టాగ్ తీసుకోవాలంటే మీ ఐడీ, వెహికిల్ రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలను క‌చ్చితంగా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇవి ఉంటేనే కేవైసీ ప్ర‌క్రియ పూర్తి అవుతుంది. ఆన్ లైన్ ద్వారా కొనాలనుకుంటే అమెజాన్ వెబ్‌సైట్‌కు లేదా ఈ ఫాస్టాగ్ అందించే బ్యాంక్ వెబ్‌సైట్ల‌కు వెళ్ల‌ి తీసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతానికి ఫాస్టాగ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, కోట‌క్‌, యాక్సిస్ బ్యాంకులు అందిస్తున్నాయి. ఇవే కాకుండా మీ ఫోన్‌లోని పేటీఎం, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యాప్స్‌ ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఫాస్టాగ్‌ లేకుంటే డబుల్‌ టోల్‌ ఫీజు, ఆదేశాలు జారీ చేసిన రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ

మీ కారుకు పేటీఎం నుంచి ఫాస్టాగ్ తీసుకోవాల‌ని అనుకుంటే.. రూ.500 నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందులోనే రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ రూ.250, క‌నీస బ్యాలెన్స్ రూ.150 కూడా ఉంటుంది. ఇక ఇదే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి అయితే.. ట్యాగ్ జారీ చేయ‌డానికి రూ.99.12, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్‌, రూ.200 క‌నీస బ్యాలెన్స్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఫాస్టాగ్‌ల‌పై ప‌లు బ్యాంక్‌లు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు కూడా ఇస్తున్నాయి.

ఫాస్టాగ్ రీఛార్జ్ కోసం మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే కొన్నారో.. దాని ఫాస్టాగ్‌ వాలెట్‌లోకి వెళ్లి ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్‌, క్రెడిట్ కార్డ్‌, లేదా యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకోవ‌చ్చు. అలాగే పేటీఎం, ఫోన్‌పె, అమెజాన్ పే, గూగుల్ పేలాంటివి వాడొచ్చు. ఇవి ఏ బ్యాంక్ ఫాస్టాగ్‌కైనా రీఛార్జ్ ఆప్ష‌న్ ఇస్తున్నాయి.