Father Of The Year: ఈ తండ్రి రియల్ హీరో, కూతుర్ల చదువు కోసం రోజూ 12 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు, బడి చివరి గంట కొట్టే వరకు అక్కడే ఉంటాడు, బాంబుల మోత మోగే ఆప్ఘనిస్తాన్‌లోని మియా ఖాన్ గురించి తెలిస్తే ఆయనకు సెల్యూట్ చేస్తారు
Father of the Year This father travels 12 km every day to take daughters to school (Photo-Facebook)

Kabul, December 7: ఆప్ఘనిస్తాన్..ఈ పేరు తెలియని వారు ఉండరు. అక్కడ నిత్యం ప్రభుత్వ దళాలు, ఉగ్రవాదులకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ బాంబు వచ్చి నెత్తి మీద పడుతుందో ఎవరికీ తెలియదు. అలాంట ఓ చోట ఓ తండ్రి తన ముగ్గురు కూతుర్ల కోసం పడుతున్న కష్టాన్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు.. ఆశ్చర్యపోవడమే కాదు ఆయనకు సెల్యూట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది. వివరాల్లోకెళితే..

ఆఫ్గనిస్తాన్‌(Afghanistan)లోని షరనా ప్రాంత నివాసి అయిన మియా ఖాన్‌(Mia Khan) నిరక్షరాస్యుడు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది. ఆయనకు ఓ కొడుకు, ముగ్గరు కూతుళ్లు. వారున్న ప్రాంతంలో స్కూల్ లేదు. అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో స్వీడిష్ కమిటీ ఆధ్వర్యం(Swedish Committee for Afghanistan)లో ఓ స్కూల్ నడుస్తోంది. నిరక్షరాస్యుడైన ఈ తండ్రి తన కూతుళ్ల(daughters)ను ఎలాగైనా చదివించాలనుకున్నాడు.

12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ స్వీడిష్ పాఠశాలలో ముగ్గురు కూతుళ్లను జాయిన్‌ చేయించాడు. అయితే అక్కడికి వెళ్లేందుకు బస్సు సదుపాయం కూడా లేకపోవడంతో ప్రతి రోజూ ఆయన తన మోటర్‌సైకిల్‌పై కూతుర్లను తీసుకెళ్తున్నాడు. కూతుళ్లను పాఠశాలలో వదిలి సాయంత్రం వరకు అక్కడే ఉంటాడు. పాఠశాల ముగియగానే కూతుళ్లను తీసుకొని ఇంటికి వస్తాడు. ఇదే ఆయన దినచర్య. తాను ఎలాగో చదువుకోలేదని, తన కూతుళ్లను పెద్ద చదవులు చదివిస్తానని మియాఖాన్‌ చెబుతున్నాడు.

నిరక్షరాస్యుడను అయినా (I am illiterate) అక్షరాల విలువ తనకు తెలుసని ఆయన తెలిపాడు. తమ ప్రాంతంలో ఆడ పిల్లల్లో వైద్యురాలు ఎవరూ లేరని తమ కుమార్తెల్లో ఎవరో ఒకరు డాక్టరై అక్కడ సేవలు అందిస్తే బాగుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ‘నేను చదువుకోలేదు. కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. నా కూతుళ్లకు మంచి విద్యను అందించడం కోసం నేను పని కూడా మానేశా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నా కూతుళ్లను చదివిస్తా. అదే నా లక్ష్యం. నా కూతుళ్లను కొడుకుల్లా పెంచి డాక్టర్లను చేయిస్తా’ అని మియా ఖాన్‌ పేర్కొన్నారు.

మియా ఖాన్‌ కూతుళ్లలో ఒకరైన రోజీ (Rozi) మాట్లాడుతూ.. తాము చదువుకుంటుంన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాన్నా లేదా అన్నయ్య(My dad or brother) ప్రతి రోజు తమను పాఠశాలకు తీసుకెళ్తారని, స్కూల్‌ ముగిసే వరకు అక్కడే ఉండి తిరిగి ఇంటికి తీసుకొస్తారని చెప్పారు.

మియా ఖాన్‌ ముగ్గురు కూతుళ్లలో ఒకరు ఐదో తరగతి, మిగతా ఇద్దరు ఆరో తరగతి చదువుతున్నారు. కాగా, మియా ఖాన్‌ స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ ఆ తడ్రిని చూస్తే గర్వంగా ఉంది’,. మియా ఖాన్‌.. రియల్‌ హీరో’. ఆ ముగ్గరు పిల్లలు అదృష్టవంతులు, గొప్ప తండ్రి దొరికాడు’ , ‘ ప్రతి తండ్రి మియా ఖాన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి’అంటూ నెటిజన్లు మియా ఖాన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఈ పాఠశాలలో 220 మందికి పైగా బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. పురాషాధిక్యత అధికంగా కలిగిన ఆఫ్ఘన్ సమాజంలో ఇప్పుడిప్పుడే మార్పులు సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. మహిళల హక్కుల కోసం వారు గొంతెత్తుతున్నారు. ఈ తండ్రి ఆశయం నెరవేరాలని అందరం మనసారా కోరుకుందాం.