New Delhi, Oct 18: ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగీ మరణం (First Death in Delhi) నమోదైంది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో ఈ ఏడాది మొత్తం 720కి పైగా డెంగీ కేసులు (Dengue) నమోదు కాగా.. అందులో ఈ నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య నమోదైన కేసులే 382 ఉన్నాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలలో కూడా ఢిల్లీలో మొత్తం 217 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత మూడేండ్లలో సెప్టెంబర్ నెలలో నమోదైన డెంగీ కేసులతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువని ఢిల్లీ ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
గత ఏడాదిలో జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 266 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఏడాది చివరికల్లా ఆ సంఖ్య 1,072కు పెరిగింది. గత ఏడాది ఒకే ఒక్క డెంగీ మరణం చోటుచేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటికే ఒకరు డెంగీతో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభం కాగానే డెంగీ విజృంభిస్తున్నది. ఆ తర్వాత శీతాకాలంలో క్రమంగా తగ్గిపోతున్నది.