New Delhi, May 13: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ నేపథ్యంలో బలహీన పడిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిదే. ఈ ప్యాకేజీకి సంబంధించి వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) ప్రకటించారు. ఈ రోజు ఆమె మీడియాతో ఆమె మాట్లాడుతూ, దేశం ముందు ఒక సమగ్రమైన దార్శనికతను ప్రధాని మోదీ (PM Modi) ఉంచారని అన్నారు. వివిధ స్థాయుల్లో సంప్రదింపులను జరిపిన తర్వాత ప్యాకేజీని ప్రకటించారని... దేశ ఆర్థికి వృద్ధిని పెంచడమే ప్యాకేజీ లక్ష్యమని చెప్పారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల కేటాయింపు, నగదు లభ్యత పెంచడమే ప్యాకేజీ లక్ష్యం, ఉద్దీపన చర్యల్లో భాగంగా 15 సహాయక చర్యలు
ఐదు మూల సూత్రాల ఆధారంగా 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' (Atamanirbhar Bharat Abhiyan) ప్రకటనను మోదీ చేశారని తెలిపారు. ఆ ఐదు సూత్రాలు... ఆర్థికం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రజలు, గిరాకీ అని చెప్పారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ఈ ప్యాకేజీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే... స్వయం ఆధారిత భారతం అని అర్థమని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కు సంబంధించిన వివరాలను రోజుకొకటి వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఈరోజు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రకటిస్తున్నామని తెలిపారు. రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
ఇందులో భాగంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. MSME రంగాలకు ఆరు సహాయక చర్యలను ప్రకటించారు. ఈ రుణాలకు నాలుగేళ్ల కాలపరిమితి, మారటోరియం ఉంటుందని తెలిపారు. MSME రుణాలకు కేంద్రం గ్యారంటీ ఇస్తుందన్నారు. ఈ ప్యాకేజీ రెండు లక్షల చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. నగదు లభ్యత పెంచడమే మా ఉద్దేశమన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ, సర్కార్ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి, 21వ శతాబ్దం భారత్‌దేనని తెలిపిన ప్రధాని మోదీ
ఆర్థిక ఇబ్బందులతో కార్యకలాపాలు నిలిపివేసిన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అక్టోబర్ వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిర్మల స్పష్టం చేశారు. 12 నెలల మారిటోరియంతో ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రుణాల చెల్లింపునకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు.
45 లక్షల పరిశ్రమలకు ఈ ఉద్దీపనతో ప్రయోజనం చేకూరునున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతేకాదు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధికి రూపకల్పన చేశామని, కార్యకలాపాలు విస్తరించి మెరుగైన అవకాశాలు అందుకునేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈక్విటీ నిధి ఉద్దేశమని తెలిపారు. నేటి నుంచి ఒక్కొక్కటిగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.