New Delhi, Mar 18: ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఫోర్త్ వేవ్ (Covid 4th Wave) పట్ల అప్రమత్తమైంది. చైనాలో కొత్త కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుండగా, దక్షిణ కొరియాలో ఒక్కరోజే 6 లక్షలకు పైగా కేసులు, 400కి పైగా మరణాలు సంభవించడం కరోనా వైరస్ ( Covid in India) ఎంత ప్రమాదకరమైందో చాటుతోంది.
దీనిపై కేంద్రం స్పందిస్తూ... రాష్ట్రాలకు హెచ్చరికలు చేసింది. కరోనా వైరస్ ను (Fourth wave of Covid-19)తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం ఓ లేఖ రాశారు. కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్ పాటించాలంటూ ఆ లేఖలో కేంద్రం సూచించింది. కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని, కరోనా మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని సూచించింది.
ముఖ్యంగా, బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాలని కేంద్రం స్పష్టం చేసింది. భారత్ లో ప్రస్తుతం కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి పడిపోయినప్పటికీ, ప్రపంచదేశాలు మళ్లీ సతమతమవుతుండడంతో తాజా హెచ్చరికలు చేసింది. ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ National Centre for Disease Control (NCDC) ప్రొటోకాల్స్ పాటిస్తూ.. టెస్టులు చేస్తుండాలని తెలిపింది. అంతేకాదు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని, ఇన్‌ఫెక్షన్‌ల తీవ్రత సోకకుండా నియంత్రించాలని సూచించారు లేఖలో. కంటోన్మైట్, క్లస్టర్, డేంజర్ జోన్‌లను అవసరమైతే ఏర్పాటు చేయాలని కోరింది.
ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసిన గైడ్‌లెన్స్‌ల గురించి ప్రస్తావించిన కేంద్రం.. పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక వ్యవహారాల కొనసాగింపునకు అనుమతులు ఇవ్వాలంటూ మరోసారి గుర్తు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా అధ్యక్షతన మార్చి 16వ తేదీన హై లెవల్ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంపై చర్చించారు. ఆపై మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖను రిలీజ్ చేశారు.
కరోనాలో కొవిడ్ కేసుల తగ్గుముఖం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2, 528 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 149గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 29, 181గా ఉంది. దాదాపు 685 రోజుల తర్వాత 30 వేలకు దిగువన యాక్టివ్ కేసుల గణాంకం నమోదు అయ్యింది. భారత్‌లో ఇప్పటిదాకా కరోనా కేసులు 4, 30, 04,005 నమోదు కాగా, మరణాల సంఖ్య 5, 16, 281గా ఉంది.