Bengaluru, February 22: సీఏఏ,ఎన్ఆర్సీలకు (Anti-CAA Rally) వ్యతిరేకంగా బెంగుళూరులో (Bengaluru) జరిగిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ సభలో ఓ యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి కలకలం రేపిన సంగతి విదితమే. 9ఏళ్ల అమూల్య లియోనా ఘటనకు వేదికపై ఉన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కార్యక్రమ నిర్వాహకులు విస్తుపోయారు. అనంతరం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
యువతి 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు, దేశ ద్రోహం కేసు నమోదు
ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. గురువారం ఫ్రీడం పార్కులో అమూల్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి వచ్చిన ఆర్థ్ర అనే యువతి నిరసనకారుల వెనుక ప్లకార్డును పట్టుకుని నిలబడింది.
‘ముస్లింలు, దళితులు, కశ్మీర్, బహుజన్, ఆదివాసీలు, ట్రాన్స్‌జెండర్లకు విముక్తి కావాలి’(Kashmir Mukti, Dalit Mukti,Muslim Mukti) అని ప్లకార్డుపై రాసి ప్రదర్శించింది. ఆ పోస్టర్‌పై ఆందోళనకారులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిందని పలువురు శ్రీరామ సేన కార్యకర్తలు ఆరోపించారు. ఈ సమయంలోయువతిపై పలువురు దూసుకెళుతుండడంతో పోలీసులు యువతిని రక్షించి ఎస్.జే.పార్కు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
దీనిపై వివరణ ఇచ్చిన సెంట్రల్ విభాగపు డీసీపీ చేతన్‌సింగ్ రాథోడ్, యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయలేదని, ఆమె చేతిలో ముక్తి కాశ్మీర్, ముక్తి ముస్లిం, ముక్త్ దలిత్ అనే ప్లకార్డు ఉంది. ఆ క్షణంలో యువతిపై దాడికి పలువురు యత్నించారన్నారు. ప్రస్తుతం ఆమె తమ అదుపులో ఉందని తెలిపారు.
ఈ యువతి వెనుక ఎవరు ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయంపై తనిఖీ చేపడుతామని చేతన్ సింగ్ రాథోడ్ తెలిపారు. అమ్యూలకు ఆరుద్ర ఫేస్‌బుక్ ఫ్రెండ్ అని పోలీసులు తెలిపారు. తాను మల్లేశ్వరం కాలేజీ విద్యార్థినని ఆరుద్ర చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
గురువారం జరిగిన ఘటనపై ధర్నా నిర్వాహకులైన శ్రీరామ సేనా రాష్ట్ర కార్యదర్శి హరీశ్ మాట్లాడుతూ... గుర్తుతెలియని యువతి ఎక్కడినుంచి వచ్చారని, ఎందుకు వచ్చారని తెలియదు. తమ ముందు నడచుకొంటూ వచ్చి అందరిలో చేరుకొని దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపించారు.
తాము ఆమెను విచారించే సందర్భంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆమె మానసిక అస్వస్థతకు గురైన మహిళ అంటూ తీసుకెళ్లారన్నారు. అయితే తాము ఇంతటితో వదలమని, శ్రీరామసేనా రాష్ట్రాధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్‌తో చర్చించి తదుపరి నిర్ధారణ తీసుకొంటామని తెలిపారు.
మరోవైపు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన అమూల్య లియోనాకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక సీఎం శుక్రవారం యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అమూల్య తండ్రి మాట్లాడుతూ...నా కూతరు పెద్ద తప్పు చేసింది. కొంతమంది ముస్లింలతో చేరి నా మాట వినడం లేదు అని ఆయన తెలిపారు.