కుక్క మాంసం ఎగుమతులు, విక్రయాలపై నిషేధం విధిస్తూ నాగాలాండ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టుకు చెందిన కోహిమా బెంచ్ కొట్టి వేసింది.ఈ సందర్భంగా ధర్మాసనం.. నిషేధ ఉత్తర్వులు జారీ చేయడానికి చీఫ్ సెక్రటరీ తగిన వ్యక్తి కాదని పేర్కొంది.
అయితే ఈ నిషేధాన్ని 2020 నవంబర్ లోనే సింగిల్ బెంచ్ ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై ఇప్పుడు హైకోర్టు కోహిమా బెంచ్ జస్టిస్ మర్లి వంకున్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. కోహిమా మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో శునకాలతో వ్యాపారం నిర్వహించే లైసెన్స్ డ్ వర్తకులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆహార భద్రత చట్టాన్ని తప్పుగా అన్వయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆరోపించారు.
జంతువులు అనే నిర్వచనం కింద శునకాలను పేర్కొనని విషయాన్ని జడ్జి లేవనెత్తారు. శునకాల వర్తకంతో పిటిషనర్లు ఆదాయం ఆర్జిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ వారికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేశారు.