GK Reddy, MoS Home on 112 Helpline | Photo: ANI

New Delhi, December 03: మహిళల భద్రత, దిశ ఘటన విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy) మంగళవారం లోకసభలో మాట్లాడుతూ '112' ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా '112 ఇండియా'  (112 India App) అత్యవసర హెల్ప్‌లైన్ యాప్ గురించి సభలో మంత్రి వివరించారు. ఈ అత్యవసర హెల్ప్‌లైన్ దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. ఇందుకోసం రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు అందజేయబడతాయని కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే స్టేషన్లలో జిఆర్‌పి, పోలీసులు మరియు విమానాశ్రయాల్లో సిఐఎస్ఎఫ్‌ బలగాలు భద్రత కల్పిస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

దేశంలోని 28 రాష్ట్రాలు మరియు 9 కేంద్రపాలిత ప్రాంత ప్రజలు 24/7 ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఆపదలో ఉన్నవారు 112 ఎమర్జెన్సీ నంబర్ డయల్ చేయడం ద్వారా పోలీసులు, వైద్యం, అగ్నిమాపక బృందాల నుంచి తక్షణ సహాయం పొందవచ్చు.

 

 

112ఇండియా యాప్ ఇలా పనిచేస్తుంది

 

ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ (ERSS) కింద అత్యవసర సమయాల్లో తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌కు వాయిస్ కాల్స్, మెసేజ్, ఈమెయిల్, ప్యానిక్ బటన్ లాంటి అన్ని ఎమర్జెన్సీ ఫీచర్స్ పొందుపరిచారు. మహిళల కోసం ప్రత్యేకంగా 'SHOUT' అనే ఫీచర్ ఉంచారు. ఆపద ఉందని అనిపించినపుడు '112ఇండియా' యాప్ ఉపయోగించడం ద్వారా తక్షణమే సమీపంలోని పోలీసు స్టేషన్లకు మరియు నమోదు చేసిన కుటుంబ సభ్యుల నెంబర్లకు సమాచారం వెళ్లిపోతుంది. దీనికి ఉండే జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా మీరున్న చోటును ఎలా చేరుకోవాలో మార్గాన్ని చూపిస్తుంది. ఈ విధంగా క్షణాల్లో పోలీసులు అక్కడికి వచ్చి సహాయం అందిస్తారు. ఇది పూర్తిగా ఉచిత సర్వీసు.

112 App

ఇక అత్యవసర వైద్య సహాయం కోసం ఉచిత అంబులెన్సుల వివరాలు, ప్రైవేట్ అంబులెన్సులు అయితే దానికయ్యే ఖర్చులు, ఇతర విషయాలు అందుబాటులో ఉంటాయి.

అగ్నిమాపక విభాగం నుండి అత్యవసర సహాయం దాదాపు ఉచితం, అయినప్పటికీ కొన్ని చోట్ల మునిసిపాలిటీని నిర్దేషించిన ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది.