వడోదర, జనవరి 18: గుజరాత్ రాష్ట్రం వడోదరలో విద్యార్థుల విహార యాత్ర విషాద యాత్రగా (Gujarat Boat Capsize) మారింది. గుజరాత్‌లో హర్ని మోత్నాథ్ సరస్సులో పడవ బోల్తాపడిన దుర్ఘటనలో 14 మంది మృతి (14 Killed After Boat Capsizes in Vadodara's Lake) చెందారు. వీరిలో 12 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. 20 మందిని రక్షించారు. వడోదర పాణిగేట్‌లోని న్యూ సన్‌రైజ్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, టీచర్లు విహార యాత్రలో భాగంగా నగర శివారులోని హరిణి లేక్ వద్దకు గురువారం సాయంత్రం వెళ్లారు.
పిక్నిక్‌కు వచ్చిన వారంతా మధ్యాహ్నం సరస్సులో బోటు షికారుకు బయలుదేరారు. సామర్థ్యానికి మంచి విద్యార్థులను ఎక్కించడంతో పడవ బోల్తా పడింది. తొలుత ప్రమాదాన్ని చూసిన స్థానికులు విద్యార్థులను రక్షించే ప్రయత్నాలు చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ జవాన్లు వచ్చి సహాయ చర్యల్లో పాల్గొన్నారు.బోటులో కేవలం 10 మంది మాత్రమే లైఫ్ జాకెట్లు ధరించినట్టు మంత్రి సంఘవి తెలిపారు. నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని ఇది తెలియజేస్తున్నదని చెప్పారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. విద్యార్థులు ప్రయాణించిన పడవ సామర్థ్యం 16 మంది కాగా, పరిమితికి మించి ఎక్కడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం అత్యున్నత విచారణకు ఆదేశించింది. ప్రమాద స్థలానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందిస్తామని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు మరియు గాయపడిన పిల్లలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.