Gujarat Coronavirus: రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్, గుజరాత్‌లో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత ఆరోగ్య కర్తకు పాజిటివ్, యాంటీబాడీస్‌ అభివృద్ధికి 45 రోజులు సమయం పడుతుందని తెలిపిన వైద్యులు
COVID-19 Vaccine (Photo Credits: PTI)

Gandhi Nagar, Mar 7: దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ పై ఆశలు చిగురిస్తుండగా...కొన్ని వార్తలు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్లీ కరోనా రావడంతో వ్యాక్సిన్ మీద ఆశలు సన్నగిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో (Gujarat Coronavirus) ఆరోగ్య శాఖకు చెందిన వ్యక్తికి రెండో డోస్ తీసుకున్న తర్వాత మళ్లీ కరోనా (Gujarat Man Infected With COVID-19) సోకింది. కాగా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందడానికి సాధారణంగా 45 రోజుల సమయం పడుతుందని అక్కడి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సెలవిస్తున్నారు.

గాంధీనగర్‌లోని దెహ్గాం తాలూకాకు చెందిన ఆరోగ్య శాఖ అధికారి జనవరి 16న కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నాడు. రెండో డోసును గత నెల 15 న పొందాడు. రెండు మూడు రోజుల తర్వాత జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపారు. అక్కడ కరోనా పాజిటివ్‌గా( COVID-19 After Taking Second Dose Of Vaccine) నిర్ధారించారు. ఈ విషయాన్ని గాంధీనగర్‌ చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎంహెచ్‌ సోలంకి ధ్రువీకరించారు. ఆయన శాంపిల్‌లో చాలా తక్కువ లక్షణాలు కనిపించాయని, సోమవారం నుంచి విధుల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపారని సోలంకి తెలిపారు.

చైనా వివాదాస్పద నిర్ణయం, కోవిడ్ పరీక్షల్లో భాగంగా మలద్వారం శుభ్రం చేసే టెస్ట్, విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు, చర్యను ఖండిస్తున్న పొరుగు దేశాలు

టీకా రెండు మోతాదులను అందించిన తర్వాత వ్యాప్తికి వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందడానికి సాధారణంగా 45 రోజులు పడుతుందని ఆయన చెప్పారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ముక్కుకు మాస్క్‌ను తప్పకుండా ధరించాలని, మిగతా కరోనా మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ మళ్లీ కరోనా సోకడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారు. ఇలా ఉండగా, గుజరాత్‌లో ఇప్పటివరకు 2,72,240 కేసులు నమోదవగా.. 4,412 మంది చనిపోయారు.