New Delhi, May 17: జ్ఞానవాపి మసీదు సర్వేపై దాఖలైన పిటిషన్ (Gyanvapi Masjid Case) విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు వేచిచూడాలని పిటిషనర్‌కు సూచించిన సుప్రీం కోర్టు (Supreme Court) తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. జ్ఞానవాపి మసీదు వీడియోగ్రాఫిక్ సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ సుప్రీంను ఆశ్రయించింది.
మంగళవారం సాయంత్రం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ట్రయల్ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు వేచిచూడాలని పిటిషనర్‌కు తెలిపింది. శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని జిల్లా మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. అదే సమయంలో నమాజ్ చేసుకునేందుకు అనుమతించాలని (Secure 'Shivling', Allow Namaz) తెలిపింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసిన కోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
మసీదు కాంప్లెక్స్‌లో లభించిన శివలింగాన్ని కాపాడాలని, ప్రార్ధనలు చేసుకునేందుకు ముస్లింలకు ఉన్న హక్కును పరిరక్షించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది.జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సీల్ చేయాలని, అక్కడకు ఎవరినీ అనుమతించవద్దని వారణాసి సివిల్ కోర్టు మే 16న ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. శివలింగాన్ని కాపాడాలని దిగువ కోర్టు ఉత్తర్వుల్లోని భాగాన్ని మాత్రం సుప్రీంకోర్టు సమర్ధించింది.
ఈ వ్యవహారంపై వారణాసి కోర్టు ప్రొసీడింగ్స్‌పై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. 16వ శతాబ్ధంలో కాశీ విశ్వనాధ్ ఆలయంలో కొంత భాగాన్ని ఔరంగజేబు ఆదేశాలతో కూల్చివేసి జ్ఞాన్‌వాపి మసీదు నిర్మించారని వారణాసి కోర్టులో 1991లో పిటిషన్ దాఖలైంది. జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో ప్రార్ధనలకు అనుమతించాలని పిటిషనర్లు, స్ధానిక పూజారులు ఎప్పటినుంచో కోరుతున్నారు.