Varanasi, Feb 7: జ్ఞాన్‌వాపీ మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ (AIMC), ASI సర్వే కోరుతూ చేసిన అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జ్ఞాన్‌వాపీ మసీదులో మూసి ఉంచిన అన్ని సెల్లార్లలో కూడా ఏఎస్ఐ ద్వారా సర్వే చేయించాలని కోరుతూ పిటిషనర్ పిటిషన్ వేసిన సంగతి విదితమే.ఈ సర్వే సెల్లార్‌లను దెబ్బతీస్తుందని AIMC వాదించింది.
గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR), ఇతర ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలోని అన్ని ఇతర మూసివేసిన సెల్లార్‌లను ASI సర్వే చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 15వ తేదీగా కోర్టు నిర్ణయించింది.ఈ వ్యాజ్యంపై అదే రోజున విచారణ జరపనున్నట్టు మంగళవారం వారాణసీ జిల్లా కోర్టు తెలిపింది.
బేస్‌మెంట్‌లో ఎనిమిది రహస్య గదులు ఉన్నాయని వాటన్నింటినీ తెరిపించి సర్వే జరపాలని పిటిషనర్ కోరారు. మందిరాన్ని కూలగొట్టి మసీదును నిర్మించారని నిరూపించడానికి ఈ సర్వే అవసరమని విన్నవించారు. మసీదుగోడపై ఉన్న హిందూ దేవతలను పూజించడానికి అనుమతించాలంటూ తొలుత దావా వేసిన విశ్వహిందూ సనాతన్ సంఘ్ వ్యవస్థాపక సభ్యురాలు రాఖీ సింగే ఈ పిటిషన్ కూడా వేశారు. ప్రస్తుతం దక్షిణ సెల్లార్‌లో సర్వే జరిపించిన కోర్టు అక్కడి విగ్రహాలకు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.