Hindu Side’s Lawyer Vishnu Shankar Jain (Photo Credit: ANI)

New Delhi, January 26: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) నివేదిక (ASI Report on Gyanvapi Mosque) పేర్కొంది. గతంలో ఉన్న భారీ హిందూ దేవాలయాన్ని కూల్చి వేసి మసీదు నిర్మించారని ఏఎస్‌ఐ సర్వేలో తేల్చినట్టు వెల్లడైంది. సర్వే రిపోర్టును గురువారం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కేసులోని ఇరుపక్షాలకు చెందిన 11 మంది కక్షిదారులకు అందజేశారు.

హిందూ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణుశంకర్‌జైన్‌ (Hindu Side’s Lawyer Vishnu Shankar Jain) ఈ రిపోర్టును బహిర్గతం చేశారు. మీడియా సమావేశంలో రిపోర్టులోని వివరాలను వెల్లడించారు. మసీదు స్థానంలో గతంలో ఆలయం ఉండేదని సర్వేలో వెల్లడైందని అన్నారు. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను, రాళ్లను వినియోగించినట్టు తేలిందన్నారు. మొత్తంగా శిల్పరీతిని బట్టి ఆలయం ఉన్నట్టుగా రుజువవుతోందని ఏఎస్‌ఐ రిపోర్ట్ పేర్కొందని చెప్పారు.

జ్ఞానవాపి కింద హిందూ ఆలయం.. భారత పురావస్తు శాఖ నివేదికను సమర్థించిన రామజన్మభూమి చీఫ్ ఆచార్య సత్యేంద్ర దాస్

ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని కూడా సర్వేలో తేలింది. ‘మసీదులో చేసిన మార్పులను ఈ సర్వే గుర్తించింది. పూర్వమున్న స్లంభాలను, ప్లాస్టర్‌ను చిన్నచిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు’అని ఏఎస్‌ఐ నివేదిక పేర్కొన్నట్లు జైన్‌ వివరించారు.

839 పేజీల ఏఎస్ఐ రిపోర్ట్ ఏం చెప్పిందంటే..

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన సర్వేకు సంబంధించి మొత్తం 839 పేజీలతో ఏఎస్ఐ రిపోర్టు తయారు చేసింది. ఇందులో ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను మసీదు నిర్మాణంలో కలిపారని చెప్పింది. మసీదు గోడలపై నాటి ఆలయ నిర్మాణం ఆనవాళ్లు ఉన్నాయని సర్వే తెలిపింది. గోడలపై 34 శాసనాలు ఉన్నాయని, ఇవి దేవనాగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో ఉన్నాయని వివరించింది.

Here's Videos

ఈ శాసనాల మీద జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నాయని సర్వే పేర్కొందని హిందూ పిటిషనర్ల తరపు న్యాయవాది విష్ణుశంకర్‌ జైన్‌ వెల్లడించారు. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను ఉపయోగించారని తేలిందన్నారు. ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను మసీదు నిర్మాణంలో యథాతథంగా అదేవిధంగా ఉంచారని వివరించారు. దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయని మరికొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కాగా వారణాసిలో విశ్వనాథుడి ఆలయం పక్కనున్న మసీదు కింద హిందూ ఆలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్‌ వేశారు. చాలా కాలం నుంచి నడుస్తున్న ఈ వివాదానికి సంబంధించి ఏఎస్‌ఐ సర్వేకి గత ఏడాది జులై 21న కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సర్వే అనంతరం డిసెంబరు 18న రిపోర్టు కోర్టుకు అందింది. సర్వే నివేదిక తమకు అందజేయాలంటూ ఇరు పక్షాలు కోర్టును కోరాయి. దీంతో రిపోర్టును అందజేశారు.