Gyanvapi Mosque Case: కీలక మలుపులు తిరుగుతున్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు, లోపల ఉన్న శివాలయంలో హిందువులు పూజలు చేసుకోవచ్చని తీర్పును వెలువరించిన వారణాసి కోర్టు
Gyanvapi Masjid Complex (Photo Credits: X/@iAkankshaP)

Varanasi, Jan 31: ఉత్తరప్రదేశ్ లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో వారాణాసి డిస్ట్రిక్ట్ కోర్టు (Gyanvapi Mosque Case) నేడు కీలక తీర్పును వెలువరించింది.నేలమాళిగలోని శివాలయం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రాంతంలో పూజించే హక్కు హిందువులకు ఉందని తెలిపింది. కాశీ విశ్వనాథ ఆలయ పూజారులే ఈ పూజలు (Offer Prayers Inside ‘Vyas Ka Tehkhana) నిర్వహించాలని వెల్లడించింది. ఈ మేరకు బారికేడ్లు తొలగించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

హిందువులు అక్కడ పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, శ్రీ కాశీ విశ్వనాథ్ ట్రస్టు ద్వారా ఓ పూజారిని కూడా నియమించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దీనిపై స్పందిస్తూ... మరో ఏడు రోజుల్లో పూజ ప్రారంభమవుతుందని, ఇక్కడ పూజ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొన్నారు.అయితే, వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను తాము పై కోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ తెలిపారు.

హిందూ ఆలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదు నిర్మించారు, 839 పేజీల ఏఎస్ఐ రిపోర్ట్ను బహిర్గతపరిచిన హిందూపక్ష న్యాయవాది విష్ణుశంకర్‌జైన్‌

నేలమాళిగలోని ఆలయంలో పూజలు చేసేందుకు సోమనాథ్ వ్యాస్ మనవడు శైలేంద్ర పాఠక్ అనుమతి కోరారు. ఈ పూజలు క్రమం తప్పకుండా జరగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు. సోమనాథ్ వ్యాస్ కుటుంబం 1551 నుంచి అర్చక సేవలో కొనసాగుతోంది.

1992లో ఉత్తరప్రదేశ్‌లోని బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జ్ఞానవాపి లోని దక్షిణ నేలమాళిగలో పూజలను నిరాకరిస్తూ వ్యాస్ కు మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని అంజుమన్ కమిటీ తరఫు న్యాయవాది తెలిపారు. జ్ఞానవాపి మసీదులోని నేలమాళిగలో ఉన్న దేవత విగ్రహానికి పూజలు జరిగేవి.

డిసెంబరు 1993లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేలమాళిగలో పూజలను నిషేధించారు. దీనిపై సోమనాథ్ వ్యాస్, రామ్‌రంగ్ శర్మ, హరిహర్ పాండేలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సర్వే నంబర్లు 9130, 31,32 లు కాశీ విశ్వనాథుని ఆస్తి అని నొక్కి చెప్పడం విశేషం.

ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో వారణాసి (Varansi)లో గల కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులను ఆరాధించడానికి అనుమతివ్వాలంటూ కొంతమంది మహిళలు ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దీనిపై గతంలో విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. సీల్‌ చేసిన వాజూఖానా మినహా.. మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌, ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం(ASI) సర్వే చేసింది.

ఈ సర్వేలో కీలక విషయాలు బయటపడినట్లు హిందువుల తరఫు న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ ఇటీవల తెలిపారు. మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నట్లు సర్వే నివేదిక పేర్కొందని వెల్లడించారు. ఆ ప్రాంగణంలో తెలుగు, కన్నడ, దేవనాగరి సహా 34 భాషల్లో ఉన్న శాసనాల ఆనవాళ్లు లభించినట్లు పేర్కొన్నారు. ఈ ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేసి మసీదు నిర్మాణంలో వినియోగించినట్లు సర్వే తేల్చిందన్నారు.తాజాగా జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని కీలక తీర్పును వెలువరించింది.