
Hisar, May 16: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు రైతుల నిరసన సెగ తగిలింది. హిసార్‌లో నిర్మించిన ఆస్పత్రిను ప్రారంభించడానికి సీఎం ఖట్టర్ (CM Manohar Lal Khattar in Hisar) వచ్చారు. సీఎం పర్యటన గురించి తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రాలీల్లో అక్కడికి తరలివచ్చి ముఖ్యమంత్రిని ఘెరావ్ చేయడానికి ప్రయత్నించారు.
ఈ కార్యక్రమంలో రైతులు నిరసన (Clashes Erupted Between Police & Farmers Protesting) వ్యక్తం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అంతే కాకుండా వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులు అడ్డంగా పెట్టిన బారీకేడ్లను రైతులు తొలగించి ముందుకు కదలడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆరు నెలలుగా ఢిల్లీ సరిహద్దులో నిరవధిక నిరసనలు (armers Protest) కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హర్యానాలోని హన్సి పట్టణంలో ఆదివారం రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు వ్యతిరేకంగా నినదాలు చేస్తూ వందల సంఖ్యలో రైతులు ర్యాలీగా ముందుకు కదిలారు. అయితే రైతులు ముందుకు వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
రైతులు వీటిని తొలగించుకుని ముందుకు వస్తున్న క్రమంలో పోలీసులు వారిపై లాఠీచార్జ్‌కి దిగారు. రైతులపై టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. రైతులను లాఠీఛార్జీ చేసి సీఎం కార్యక్రమం వేదిక నుంచి తరలించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడం వల్లనే లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చిందని పోలీసులంటున్నారు.
కాగా, దీనిపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా కొనసాగుతున్న రైతు నిరసనపై పోలీసులచేత దాడులు చేయిస్తున్నాయని ప్రభుత్వాలను విమర్శించారు. ఇదిలా ఉంటే పరిస్థితులు సాధారణమైన తర్వాత రైతులు ఆందోళనకు దిగవచ్చని, కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిరసన తెలుపుతున్న రైతులు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్లిపోవాలని సీఎం ఖట్టర్ సూచించారు. ఇలాఉండగా, హర్యానాలో లాక్‌డౌన్ను ఈ నెల 24 వరకు పొడగించినట్లు హోంమంత్రి అనిల్ విజ్ ప్రకటించారు.