Hyderabad Encounter Case: ఆ నలుగురి మృతదేహాలను వచ్చే శుక్రవారం వరకు భద్రపరచాలంటూ హైకోర్ట్ ఆదేశం, విచారణ గురువారానికి వాయిదా, బుధవారం ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ
High Court of Telangana| Photo Credits: Wikimedia Commons

Hyderabad, December 09: నలుగురి క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్ చేసినందుకు పోలీసుల మెడకు ఇటు కోర్టు కేసులు, మానవ హక్కులు మెడకు చుట్టుకున్నాయి.

దిశ హత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు డిసెంబర్ 06న పోలీసులు జరిపిన 'ఎదురు'కాల్పుల్లో హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి హైకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది.

ఎన్‌కౌంటర్‌ చేసే విషయంలో పోలీసులు సుప్రీంకోర్ట్ మార్గదర్శకాలను పాటించారా? ఆధారాలు చూపాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది. అయితే దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పూర్తి వివరాల కోసం కొంత సమయం కోరడంతో తదుపరి విచారణను హైకోర్ట్ గురువారానికి వాయిదా వేసింది, అలాగే శుక్రవారం వరకు నలుగురి నిందితుల మృతదేహాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచాలని హైకోర్ట్ ఆదేశించింది.

మరోవైపు సుప్రీంకోర్టులోనూ ఈ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని తెలంగాణ పోలీసులు ఆ నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌‌లకు సంబంధించి సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన మార్గదర్శకాలను బేఖాతరు చేశారు. ఈ కేసును తక్షణమే విచారించాలని, బాధ్యులైన తెలంగాణ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బూటకపు ప్రాణాలు కోల్పోయిన ఆ నలుగురి నిందితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున నష్టపరిహారం కూడా ఇప్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే, ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ హైకోర్ట్ విచారణలో ఉందని చెప్తూ తక్షణ విచారణకు నిరాకరించిన సీజేఐ బొబ్డే,  ఈ బుధవారం విచారణకు స్వీకరిస్తామని తెలిపారు. దీంతో ఈనెల 11న సుప్రీంకోర్టులో, ఆ మరుసటి రోజు 12న హైకోర్టులో ఎన్‌కౌంటర్‌పై విచారణ జరగనుంది.

ఇక ఇదే కేసును సుమోటోగా తీసుకొని ప్రత్యేకంగా దిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి విచారణ చేపడుతున్న జాతీయ మానవ హక్కుల కమీషన్ బృందం మూడవరోజు తమ విచారణను కొనసాగిస్తుంది. రేపటి వరకు ఈ అంశంపై స్పందించే అవకాశం ఉంది లేదా వివరాలు గోప్యంగానే ఉంచే అవకాశం ఉంది. 'దిశ' దశ దిన కర్మను నిర్వహిస్తుండగా విచారణకు రావాల్సిందిగా దిశ ఫ్యామిలీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు

కాగా, ఈ ఎన్‌కౌంటర్‌పై మెజారిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా,  రేప్ - హత్య జరిగినపుడు స్పందిచనివి,   నలుగురు క్రిమినల్స్‌ను చంపితే వ్యవస్థలు స్పందించే తీరును, వ్యవస్థలలోని లొసుగొలను అడ్డుపెట్టుకొని కొన్ని వర్గాల వారు కల్పిస్తున్న చిక్కులను చూసి అదే ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. అనవసరంగా ఈ అంశంపై సమయాన్ని వృధా చేసే బదులు, అన్యాయానికి గురైనపుడు బాధిత కుటుంబాలకు తొందరగా న్యాయం జరిగేలా చట్టాలను మార్చాలి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.