Hyderabad Encounter: దిశకేసులో ఎన్‌కౌంటర్‌పై నేడు హైకోర్టులో విచారణ, ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, స్టేట్‌మెంట్లను రికార్డ్ చేస్తున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ
File Images of Four accused & Cyberabad CP VC Sajjanar | (Photo Credits: IANS)

Hyderabad, December 9: హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం (Disha Case) లో నలుగురు నిందితులపై డిసెంబర్ 06న జరిగిన ఎన్‌కౌంటర్‌ (Encounter)కు సంబంధించి సోమవారం హైకోర్టు (High Court) లో విచారణ జరగనుంది. ఈ ఎన్‌కౌంటర్‌ను జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC) సుమొటోగా స్వీకరించి విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఆ నలుగురు నిందితుల మృతదేహాలను డిసెంబర్ 09 రాత్రి, 8 గంటల వరకు భద్రపరచవలసిందిగా హైకోర్ట్ ఆదేశించింది. ఇప్పటికే దిల్లీ నుంచి వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలాన్ని మరియు ఆ నలుగురి  (Accused Four) మృతదేహాలను పరిశీలించింది. నిన్న ఆదివారం కూడా నిందితుల తల్లిదండ్రులతో కూడా ఎన్‌కౌంటర్‌ పై ఏమైనా అనుమానాలు ఉన్నాయా? వారి అనుమానాలను, అభిప్రాయాలను నమోదు చేసుకుంది. ఇటు దిశ తల్లిదండ్రులతో కూడా విచారణ జరిపిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ముందే ఏమైనా వారికి సమాచారం అందిందా అనే దానిపై ప్రశ్నించింది. అయితే టీవీల్లోనే చూశాం అన్నట్లుగా వారు బదులిచ్చినట్లు తెలుస్తుంది.

కాగా, సోమవారం ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారించనుంది, దిశ పేరేంట్స్ ను కూడా మరోసారి విచారించనున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్‌కౌంటర్‌పై రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ నేతృత్వంలో 7 గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురిని చంపాల్సి వచ్చింది? ఎన్‌కౌంటర్‌కు దారితీసిన అంశాలపై సిట్ లోతైన దర్యాప్తు చేపట్టనుంది. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారించి, ఎన్‌కౌంటర్‌ లో పాల్గొన్న పోలీసుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసి నిజానిజాలను నిర్ధారించి నివేదిక సమర్పించనుంది.

మరోవైపు నలుగురు నిందితుల తల్లిదండ్రులు వారి మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు హైకోర్ట్ అనుమతిస్తే, పోలీసులు వారి మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించేందుకు వారివారి కుటుంబీకులకు అప్పగించనున్నారు.

ఇదిలా ఉండగా, ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీరుపై దిశ కుటుంబీకులు, కాలనీవాసులు అసహనం వ్యక్తం చేశారు. పుట్టెడు దు:ఖంతో ఆదివారం దిశ దశ దిన కర్మను నిర్వహిస్తుండగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారిని విచారణకు తీసుకురావాల్సిందిగా పోలీసులను పంపడంపై మండిపడ్డారు. ప్రశాంతంగా ఎలాంటి కార్యాలను నిర్వహించుకోనివ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో పోలీసులు దిశ కర్మ కార్యం జరిపే వరకు ఓపిక పట్టి, ఆ తర్వాత వారిని ఒప్పించి విచారణకు తీసుకెళ్లారు.

ఇక దిశపై దారుణం జరిగినపుడు స్పందించని ఎన్‌హెచ్‌ఆర్‌సీ, నలుగురు క్రిమినల్స్ చనిపోతే ఎందుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు లేని హక్కులు క్రిమినల్స్ కు ఎందుకు కంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందానికి వ్యతిరేకంగా కాలనీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.