HDFC Bank net banking, mobile app down for 2nd day in row (Photo-Wikimedia)

Mumbai, April 5: ప్రైవేట్‌ రంగంలో నంబర్‌ వన్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో దేశీయంగా అతిపెద్ద గృహ రుణ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం (HDFC merger with HDFC Bank) కానుంది. ఇది దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద విలీనం (HDFC duo's merger) కాగా.. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మరింత భారీ రూపాన్ని సంతరించుకోనుంది. విలీనంతో బ్యాంక్‌లో 41 శాతం వాటా హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌హోల్డర్ల స్వంతమవుతుంది. అలాగే ఇకముందు విలీన కంపెనీ పూర్తిగా 100 శాతం పబ్లిక్‌ షేర్‌హోల్డర్లకు చెందుతుంది.

42:25 నిష్పత్తిలో విలీనాన్ని చేపట్టనున్నట్లు రెండు సంస్థలూ వెల్లడించాయి. అంటే హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ వాటాదారుల వద్దగల ప్రతీ 25 షేర్ల స్థానే 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు జారీ కానున్నాయి. ఈ మేరకు సోమవారం ఇరు సంస్థలూ స్టాక్‌ ఎక్సేంజీలకు ఈ మేరకు సమాచారం అందించాయి. రిజర్వ్‌బ్యాంక్‌, ఇతర అవసరమైన నియంత్రణాపరమైన అనుమతులకు లోబడి ఈ విలీనం జరుగుతుంది. వచ్చే ఏడాది 2 లేదా 3వ త్రైమాసికంలో విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. ఇక అనుబంధ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సైతం విలీనంలో భాగంకానున్నాయి.

యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరడా, 22 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ

హెచ్‌డీఎఫ్‌సీ విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్తగా గృహ రుణ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోనుంది. కస్టమర్ల సంఖ్యను సైతం భారీగా పెంచుకోనుంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ మొత్తం రూ. 6.23 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ఇదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆస్తులు రూ. 19.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 6.8 కోట్ల కస్టమర్‌ బేస్‌ను కలిగి ఉంది. దీర్ఘకాలిక రుణాలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన విభిన్న చౌక వ్యయాలతోకూడిన మూలధన అవకాశాలను కలిగి ఉంది. ఈ విలీనంతో బ్యాంకుకు మరింత విలువ చేకూరనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది.

3,000 నగరాలు, పట్టణాల్లో 6,342 శాఖలున్నాయి. ఇక బ్యాంక్‌లకు సహజంగా డిపాజిట్లు సేకరించుకునే వెసులుబాటు ఉన్నందున హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిధుల సేకరణ వ్యయం తక్కువ. కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు బలాబలాలు కలసిరావడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలువ మరింత పెంపొందుతుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. విలీనంతో ఏర్పడే భారీ బ్యాలెన్స్‌ షీట్‌, నికర విలువల కారణంగా బ్యాంక్‌ ప్రయోజనం పొందుతుందన్నది. దీంతో భారీ పరిమాణంగల రుణాలివ్వగలుగుతుందని, భారత ఆర్థిక వ్యవస్థలో రుణ వితరణ మరింతగా జరిగే తోడ్పడుతుందన్నది.

వాట్సాప్ నుంచి సంచలన ఫీచర్, ఒక మెసేజ్‌ను ఒక గ్రూపుకు మాత్రమే ఫార్వర్డ్‌ చేసేలా సరికొత్త అప్‌డేట్

ఈ విలీనం సమాన సంస్థలు ఒకటికావడమేనని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ వ్యాఖ్యానించారు. సంయుక్త సంస్థ బ్యాలన్స్‌షీట్‌ రూ. 17.87 లక్షల కోట్లకు చేరనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. నెట్‌వర్త్‌ రూ. 3.3 లక్షల కోట్లను తాకనున్నట్లు తెలియజేశారు. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)ల మధ్య నిబంధనలు క్రమబద్ధీకరించడంతో నియంత్రణ సంస్థల మధ్యవర్తిత్వ అవసరాన్ని తగ్గించినట్లు వివరించారు. ఇది రెండు సంస్థల విలీన నిర్ణయంలో ఒక కీలకాంశంగా నిలిచినట్లు వెల్లడించారు.

గత మూడు వారాలుగా విలీన చర్చలు జరుగుతున్నాయని, నిబంధనలకు అనుగుణంగా మొండిబకాయిల గుర్తింపు తదితర పలు అంశాలను సరైన విలువలో మదింపు చేయవలసి వచ్చిందని తెలియజేశారు. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా ప్రాధాన్యతా రంగ రుణ విడుదల తప్పనిసరికాకపోగా.. లయబిలిటీల కోసం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్‌) లేదా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌)ని నిర్వహించవలసిన అవసరంకూడా లేదని పేర్కొన్నారు. దీంతో ఆస్తి, అప్పుల సమన్వయానికి ఆర్‌బీఐ నుంచి గడువును కోరవలసి వచ్చినట్లు వెల్లడించారు. విలీనానికి నియంత్రణ సంస్థలు అనుమతిస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావమూ ఉండబోదని స్పష్టం చేశారు.

20 యూట్యూబ్ ఛానళ్లు, 2 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఐటీ చట్టం 2021 ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడి

ఆర్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌తో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మధ్య విలీనానికి దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే బీజం పడినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, చౌక ధరల గృహాలకు రుణాలు సమకూర్చేందుకు వీలుగా దీర్ఘకాలిక బాండ్ల జారీకి బ్యాంకులను అనుమతిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ 2014 జూలైలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. తద్వారా ఈ మార్గంలో సమీకరించిన నిధులకు బ్యాంకులు ఎస్‌ఎల్‌ఆర్‌ లేదా సీఆర్‌ఆర్‌ను నిర్వహించవలసిన అవసరంలేదంటూ పేర్కొంది. అంతేకాకుండా ఈ నిధులను ప్రాధాన్యతా రంగ రుణ లక్ష్యాలకు తప్పనిసరిగా కేటాయించవలసిన అవస రంలేదని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం మధ్య విలీన అంశం చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని రెండు సంస్థల కీలక అధికారులు తోసిపుచ్చారు! అయితే ఎనిమిదేళ్ల అనంతరం ఇది కార్యరూపం దాల్చడం ప్రస్తావించదగ్గ విషయం!

1994 నుంచీ..: హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విడిగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆదిత్య పురీ నేతృత్వంలో బ్యాంక్‌ కార్యకలాపాలు 1994లో ప్రారంభమయ్యాయి. దీపక్‌ పరేఖ్‌ కోరిక మేరకు విదేశీ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీని వీడిన పురీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పగ్గాలు చేపట్టారు. బ్యాంకులో మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీకి 21% వాటా ఉంది. 2020 అక్టోబర్‌లో శశిధర్‌ జగదీశన్‌ బ్యాంక్‌ బాధ్యతలు చేపట్టిన సంగతి

తెలిసిందే.

మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకోనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దేశీయంగా అతిపెద్ద బ్యాంకుల్లో రెండో ర్యాంకులో నిలవనున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తాజాగా పేర్కొంది. తొలి స్థానంలో పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) కొనసాగనున్నట్లు తెలియజేసింది. అయితే విలీన సంస్థ మరో ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ పరిమాణంకంటే రెట్టింపు స్థాయికి చేరనున్నట్లు వివరించింది. విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. 15 శాతం మార్కెట్‌ వాటాతోపాటు, డైవర్సిఫైడ్‌ ఆదాయాన్ని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బ్యాంక్‌ మార్కెట్‌ వాటా 11 శాతంగా నమోదైనట్లు తెలిపింది. పోర్ట్‌ఫోలియోలో మార్టిగేజ్‌ రుణాల వాటా ప్రస్తుత 11 శాతం నుంచి మూడోవంతుకు చేరనున్నట్లు వివరించింది.