Heavy Rains To Hit Telugu States in Next 2 Days (Photo-Twitter)

Hyderabad, October 19: ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశముంది. వర్షంతోపాటు  పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఇది అక్టోబర్ 20న మరింత బలపడే అవకాశాలున్నాయి. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. ఈ కారణంగా శనివారం కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి.   అలాగే అక్టోబర్ 21, 22 తేదీల్లో కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంటుందని ఐఎండీ తెలిపింది.

ఇప్పటికే కొన్ని జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

శుక్రవారం హుజూరాబాద్‌లో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం, నల్లగొండ, ఆదిలాబాద్‌, నిర్మల్‌, సిరిసిల్ల జిల్లాల్లో 4 సెం.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ అయితే ఇంకా వర్షాల నుంచి తేరుకోనే లేదు.