Shimla, Nov 2: హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో (Himachal Bypoll Results 2021) బీజేపీకి ఘోర పరాభవం ఎదురయింది. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది. మండి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ (Congress) విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ప్రతిభా సింగ్.. బీజేపీ (BJP) అభ్యర్థి కుషాల్ ఠాకూర్‌పై గెలుపొందారు. దాదాపు పది వేల ఓట్ల తేడాతో బ్రిగేడియర్ కుషాల్ ఓటమి పాలయ్యారు. ఇక ఫతేపూర్, ఆర్కీ, జుబ్బల్ అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఫతేపూర్ నుంచి భవానీ సింగ్, ఆర్కీ నుంచి సంజయ్, జుబ్బల్ నుంచి రోహిత్ ఠాకూర్‌లు గెలుపొందారు.
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకున్నట్లే కనిపిస్తోంది. మొత్తం 11 రాష్ట్రాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు లోక్‌సభ నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల అవుతున్నాయి. కాగా, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఆశాజనకంగా కనిపిస్తోంది. దీదీ ఇలాకాలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది.
బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం, డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ
అధికార తృణమూల్ పార్టీకి బీజేపీ ఇవ్వలేకపోయింది. కూచ్‌బిహార్ జిల్లాలోని దిన్‌హటా స్థానంలో టీఎంసీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ స్థానమైన దిన్‌హటాలో ఈసారి టీఎంసీ తరపున ఉదయన్ గుహ పోటీలో నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్తి అశోక్ మండల్‌పై .. ఉదయన్ సుమారు లక్షన్నర ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
గోసాబాలో టీఎంసీ అభ్యర్థి సుబ్రత మోండల్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పలశ్ రాణా కన్నా 1,24,249 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. శాంతిపూర్‌లో టీఎంసీ అభ్యర్థి బ్రజ కిశోర్ గోస్వామి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నిరంజన్ బిశ్వాస్ కన్నా 15,548 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. భబానీపూర్‌లో ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేసిన సోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ్‌ని ఖర్దా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ నిలిపింది. సోవన్‌దేబ్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోసం తన స్థానాన్ని ఖాళీ చేశారు. తాజా సమాచారం ప్రకారం, సోవన్‌దేబ్ ఖర్దా శాసన సభ నియోజకవర్గంలో దాదాపు 93 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు జాతీయ మీడియా తెలిపింది.