Polls 2021 | (Photo-PTI)

Hyderabad, October 30: తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నియోజకవర్గానికి ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, వీణవంక, కమలాపూర్‌, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్‌ జరగుతుంది. మొత్తం 106 గ్రామపంచాయతీల్లో 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నాయి. అయితే ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు.

పోలింగ్‌కు అంతరాయం లేకుండా విద్యుత్‌తోపాటు సోలార్‌ లైట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1715 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 107 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3865 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓటర్లు తప్పకుండా మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటించాలని ఎన్నికల అధికారి సూచించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84.5 శాతం పోలింగ్‌ నమోదయిందని చెప్పారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కేవలం తెలంగాణ మాత్రమే కాదు, యావత్ దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఇక్కడ బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట నర్సింగరావు సహా మొత్తం 30 మంది అభ్యర్ధులు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు.

రేపే తెలుగు రాష్ట్రాల ఉప ఎన్నికలు, బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు

అటు ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. బద్వేల్‌ ఉపఎన్నిక మొత్తం 15 మంది బరిలో అభ్యర్థులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,12,730 మంది ఓట్లరు ఉండగా, ఇందులో పురుషులు 1,06,650 మంది, మహిళలు 1,06,069 మంది, ఇతరులు 20 ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నికకు 3 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నిక బరిలో వైయస్సార్‌సీపీ, బీజేపీ అభ్యర్ధులు ప్రధానంగా పోటీ పడుతున్నారు.