Hyderabad, September 15: నేషనల్ లెవెల్ అయినా, గ్లోబల్ లెవెల్ అయినా, పోటీ ఎలా ఉన్నా హైదరాబాద్ తన స్థానాన్ని ఎల్లప్పుడూ అగ్రభాగంలో ఉంచుకోవడం అలవాటుగా చేసుకుంటోంది. ఇటీవలే జెఎల్ఎల్ సిటీ మొమెంటం ఇండెక్స్ 2020 లో ప్రపంచంలోని మోస్ట్ డైనమిక్ సిటీగా ఎంపికైన మన భాగ్యనగరం తన ఘనతను మరోసారి చాటుకుంది. 'హాలిడిఫై' అనబడే ఓ డెస్టినేషన్ డిస్కవరీ వెబ్‌సైట్ భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన మరియు ఉద్యోగ నిర్వహణకు సంబంధించి దేశవ్యాప్తంగా 34 ఉత్తమ నగరాలను సర్వే చేస్తే హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలిచింది.
టూరిస్టులు వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడానికి మరియు వారి హాలిడేను ఎలాంటి ఇబ్బందులు లేని పద్ధతిలో ప్లాన్ చేయడానికి ఈ హాలిడేఫై.కామ్ వెబ్‌సైట్ వారికి సహాయపడుతుంది.
భిన్న సంస్కృతుల సమ్మేళనం, మంచి నిర్మాణాలు, పుష్కలమైన మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన అభివృద్ధి మరియు బలమైన ఆర్థిక వ్యవస్థ మొదలగు ప్రమాణాల ఆధారంగా జాతీయ స్థాయిలో ఈ సర్వే నిర్వహించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఆ జాబితాలో చోటు సంపాదించిన నగరాలు నమ్మశక్యం కాని రీతిలో నిరంతరాయంగా పురోగతి వైపు ఘనమైన ప్రయత్నాలు చేస్తాయని సర్వేలో తేలింది.
ఆ సర్వే ప్రకారం ముత్యాల నగరం హైదరాబాద్ దేశంలోని ఇతర మెగా సిటీలను వెనక్కి నెట్టి 5 పాయింట్లకు గానూ 4 రేటింగ్ పాయింట్లతో దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ముంబై, పుణే, బెంగళూరు మరియు చెన్నై నగరాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.
నివేదిక ప్రకారం, సెప్టెంబర్ నుండి మార్చి వరకు హైదరాబాద్ సందర్శించడానికి ఉత్తమ సమయంగా పేర్కొనగా, నగరంలో చారిత్రాత్మకమైన చార్మినార్, గోల్కొండ కోట మరియు డ్రీమ్ ల్యాండ్ రామోజీ ఫిల్మ్ సిటీ లాంటివి మంచిమంచి చూడదగ్గ ప్రదేశాలున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ఈ నగరం మణిహారం, దక్షిణ భారతదేశానికే ఒక న్యూయార్క్ తరహా నగరంగా వేగంగా రూపుదిద్దుకుంటున్న గొప్ప ప్రదేశంగా హైదరాబాద్ నగరాన్ని సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది.