Hyd, Oct 8: తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో సరికొత్త కేసు బయటపడింది. డబ్బులు సంపాదించేందుకు ఓ సాప్ట్ వేర్ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకు వస్తున్న జీతం సరిపోక మరింతగా సంపాదించాలనే ఆశతో ఏకంగా పోర్న్ (Techie held for selling child porn videos) వ్యాపారంలోకి దిగాడు. జల్సాలకు అలవాటు పడిన ఈ టెకి చైల్డ్ పోర్న్ వీడియోలను సోషల్ మీడియా గ్రూపుల (messaging platform) ద్వారా అమ్మకాలు సాగిస్తూ గురువారం పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోన్న మధుకర్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని ఎల్‌ఎండీ కాలనీ పోలీసుస్టేషన్ పరిధిలోని నుస్తుల్లాపూర్. అయితే సులభమైన డబ్బు సంపాదించేందుకు తన మొబైల్‌లోని టెలీగ్రామ్ యాప్ ద్వారా పోర్న్‌వెబ్ సైట్ల నుంచి చిన్నారుల అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసి అదే యాప్ ద్వారా వాటిని రూ.100కు 300 నుంచి 1000 వరకు విక్రయిస్తున్నాడు. ఇక మధుకర్ రెడ్డి క్రియేట్ చేసిన సోషల్ మీడియా గ్రూప్‌లో చేరేందుకు రూ.100 పెట్టి జాయిన్ అవ్వాలని షరతు పెట్టాడు.
ఈ పేమెంట్ల కోసం థర్డ్ పార్టీ ద్వారా క్యూ ఆర్ కోడ్ పొంది స్కాన్ అండ్ పేతో డబ్బులు తన అకౌంట్లోకి జమ అయ్యేలా చేసుకున్నాడు. అయితే రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల వేధింపుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం రూపొందించిన సాఫ్ట్‌వేర్ల ద్వారా ఎస్సై పి.హరీశ్ సైబర్ పెట్రోలింగ్ చేస్తుండగా మధుకర్‌రెడ్డి వ్యవహారాన్ని గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు.