New Delhi, Dec 8: తమిళనాడులో కుప్పకూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్ ఘటనపై కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. హెలికాఫ్టర్ ప్రమాదం (IAF Helicopter Crash) గురించి ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ వివరించారు. ఈ ప్రమాదంపై ప్రధాని ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదంపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ (Defence Minister Rajnath Singh) ప్రకటన చేయనున్నారు.
కాగా తమిళనాడులో డిఫెన్స్ హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు మరణించారని నీలగిరి జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ హెలికాఫ్టర్‌లో సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారని సమాచారం.ఆర్మీ హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం తమిళనాడులోని కోయంబత్తూరు – కూనూరు మధ్య కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ కు (CDS Gen Bipin Rawa) తీవ్ర గాయాలు కాగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న వెల్లింగ్టన్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంత వరకు ఈ ప్రమాదానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.
జనరల్ రావత్ ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ఈ హెలికాప్టర్లో ప్రయాణించారు. ఈ ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) దర్యాప్తునకు ఆదేశించింది. ఐఏఎఫ్ ఇచ్చిన ట్వీట్‌లో, ఐఏఎఫ్ ఎంఐ-17వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదానికి గురైందని పేర్కొంది. దీనిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు తెలిపింది. కోయంబత్తూరు-సూలూరు మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది.
ఈ హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ సహా మొత్తం మీద దీనిలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు