Deadly Coronavirus turns busy Chinese cities into ghost towns (Photo-ANI)

New Delhi, July 16: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (coronavirus) పంజా విసురుతోంది. ఇంకా మెడిసిన్ అందుబాటులోకి రాకపోవడంతో అది కల్లోలాన్ని రేపుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కంటికి కన్పించని కరోనా వైరస్‌తో వైద్యులు పోరాడుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా విధుల్లో వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోతున్న డాక్టర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఇప్పటి వరకు దేశంలో 1,302 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 99 మంది ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(IMA) తెలిపింది. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులను ఐఎంఏ అలర్ట్‌ చేసింది. కరోనాని జయించిన 103 ఏళ్ల బామ్మ, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 కోవిడ్-19 కేసులు, 9,70,169కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

కరోనా సోకినవారిలో 586 మంది ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులు ( practising doctors) కాగా, 566 మంది రెసిడెంట్‌ డాక్టర్లు (resident doctors), 150 మంది హౌస్‌ సర్జన్లు ఉన్నారని ఐఎంఏ (Indian Medical Association) ఏర్పాటు చేసిన నేషనల్‌ కోవిడ్‌ రిజిస్ట్రీ తెలిపింది. చనిపోయిన వైద్యులలో 73 మంది 50ఏండ్లు పైబడిన వారు కాగా, 19 మంది 35-50 ఏళ్ల మధ్య వయస్సుగలవారని పేర్కొంది. ఏడుగురు మాత్రం 35ఏళ్లలోపు వారని వెల్లడించింది.

కరోనా వైరస్ కారణంగా యూపీ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఘూరా రామ్ ప్రాణాలు కోల్పోయారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారు జామున మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో మంగళవారం రాత్రి రామ్‌ను ఆస్పత్రిలో చేర్చినట్టు ఆయన కుమారుడు సంతోష్ కుమార్ వెల్లడించారు. నిన్న వెలువడిన వైద్య పరీక్షల్లో తన తండ్రికి కొవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయ్యిందనీ.. సాయంత్రానికల్లా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని సంతోష్ తెలిపారు.

కోవిడ్‌-19పై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు నిర్వేదం వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులు కావాలని, లేదంటే దేవుడే దిక్కని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై మంత్రి గురువారంనాడు మాట్లాడుతూ.. 'ఈ సమయంలో మనల్ని కాపాడ గలిగేదెవరు? దేవుడే కాపాడాలి. లేదా ప్రజలు ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇందువల్ల ఎవరికీ ఉపయోగం కూడా ఉండదు' అని అన్నారు. కర్ణాటకలో ఇంతవరకూ 47,253 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇందులో 18,466 మందికి స్వస్థత చేకూరగా, 27,853 యాక్టివ్ కేసులున్నాయి. 597 మంది ఐసీయూలో చేరారు. 928 మంది మృతి చెందారు.