Coronavirus in India: కరోనాని జయించిన 103 ఏళ్ల బామ్మ, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 కోవిడ్-19 కేసులు, 9,70,169కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Coronavirus Outbreak in India . |(Photo Credits: PTI)

New Delhi, July 16: దేశంలో క‌రోనా వైర‌స్ (Coronavirus in India) విజృంభిస్తున్న‌ది. గ‌త ప‌ది రోజులుగా 25 నుంచి 29 వేలకు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌గా, మొద‌టిసారిగా 30 వేల మార్కును దాటాయి. దీంతో దేశంలో కరోనా కేసులు పది లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఇంత అధిక మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ తప్పదా? మరోసారి లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్న పలు రాష్ట్రాలు, కొవిడ్‌-19 కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానానికి భారత్

దేశంలో మొత్తం కేసుల సంఖ్య ( COVID 19 Cases) 9,70,169కు చేరింది. బుధవారం రోజు 606 మరణాలు సంభవించగా ఇప్పటి వరకు 24,929 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 6,12,815 మంది బాధితులు కోలుకోగా, 3,31,146 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా 36,15,991 ​కేసులతో ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 19,70,909 కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. భారత్‌ మూడు స్థానంలో కొనసాగుతోంది.

మహారాష్ట్రలో మొత్తం 2,75,640 మందికి కరోనా సోకగా, ఢిల్లీలో 1,16,993 మంది కరోనా బారిన పడ్డారు. ఇక తమిళనాడులో ఈ సంఖ్య 1,50,001గా ఉంది. దేశంలో నిన్న ఒకేరోజు 3,26,826 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. దేశ‌వ్యాప్తంగా జూలై 15 వ‌ర‌కు 1,27,39,490 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది.

తమిళనాడులో 103 ఏళ్ల వృద్ధురాలు కరోనా నుంచి విజయవంతంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యింది. ఈనెల ఒకటో తేదీన అనారోగ్యానికి గురికావడంతో ఆరోగ్య సిబ్బంది వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. చికిత్స నిమిత్తం అంబూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. బామ్మ కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.