New Delhi, May 30: దేశ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఢిల్లీలో (Delhi Heatwave) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం 4.14 గంటలకు నగరంలోని మంగేశ్‌పూర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయిన విషయం తెలిసిందే. అయితే గురువారం కూడా దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉందని, వడగాల్సులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అయితే రేపటి నుంచి ఢిల్లీ (Delhi weather) వాసులకు కొంత ఊరట లభిస్తుందని వెల్లడించింది. శుక్రవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ మోస్తరు వర్షం లేదా చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 25-35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది.
India's weather department issued a red alert for several parts of the country's northwest, warning of a severe heat wave a day after parts of the capital Delhi recorded their highest temperature ever at almost 122 Fahrenheit https://t.co/zlfe4ePjnR
— Reuters (@Reuters) May 29, 2024
ఢిల్లీలోని మంగేశ్‌పూర్‌లో బుధవారం నమోదైన 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత గత రికార్డులను చెరిపేసింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదుకావడం ఇదే తొలిసారి. 2016 మే నెలలో రాజస్థాన్‌లో ఫలోడీలో 51 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. ఇప్పటివరకు భారత్‌లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. అంతకుముందు 1956లోనూ రాజస్థాన్‌లోని అల్వార్‌లో 50.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.
అయితే ఢిల్లీలోని మంగేశ్‌పూర్ ప్రాంతంలో దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో సంబంధిత డాటా కచ్చితత్వంపై పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఉష్ణోగ్రత డాటాను పరిశీలిస్తున్నామని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సెన్సార్ లేదా లోకల్ ఫ్యాక్టర్స్‌లో ఎర్రర్ కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. డాటాను, సెన్సార్‌లను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీలో అంత స్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు ఉండకపోవచ్చని, దీన్ని వెరిఫై చేయాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఐఎండీ అధికారులకు సూచించారు.