New Delhi, AUG 11: కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషపడే లోపే...మరో కొత్త సమస్య వచ్చింది. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. అయితే ఢిల్లీలో మాత్రం కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా హస్తినలో కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఒమిక్రాన్ కు చెందిన సబ్ వేరియంట్ ను పలువురు పేషంట్లలో గుర్తించారు. దీని వల్లనే కేసులు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. కరోనా సబ్ వేరియంట్ బీఏ 2.75కు (BA 2.75 ) మరింతగా వ్యాపించే గుణం ఉందని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (LNJP) హాస్పిటల్ వైద్యాధికారులు గురువారం తెలిపారు. ఈ వారంలో 90 మంది కరోనా రోగుల (Corona patients) నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్, విశ్లేషణకు పంపినట్లు చెప్పారు. ఇందులో సగానికిపైగా నమూనాల్లో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఏ 2.75ను గుర్తించినట్లు వెల్లడించారు.
ఒమిక్రాన్ గత వేరియంట్ కంటే ఇది మరింతగా వ్యాపిస్తుందని వివరించారు. అయితే అనారోగ్యం తీవ్రత తక్కువగానే ఉన్నదని, ఐదు నుంచి వారం రోజుల్లోనే రోగులు కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
మరోవైపు, ఢిల్లీలో గత 24 గంటల్లో 2,146 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 8 మంది మరణించారు. గత 24 గంటల్లో దేశంలో ఇదే గరిష్ఠ సంఖ్య. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించనున్నారు. అయితే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించే వారికి ఇది వర్తించదని అధికారులు తెలిపారు.