Indian Army returns yaks, calves to China | (Photo Credits: ANI)

New Delhi, September 7: చైనా భారత్‌ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ( India-China Border Tensions) మారుతున్నాయి. డ్రాగన్ కంట్రీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇలాంటి విపత్కర సమయంలోనూ భారత్‌ మానవత్వాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సంచరిస్తున్న 13 జడల బర్రెలు, 4 దూడలను భారత సైన్యం చైనా సైన్యానికి (Indian Army Returns 13 Yaks, 4 Calves to China ) అప్పగించింది. ఈ విషయాన్ని ఈస్ట్రన్ కమాండ్ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

చైనా అధికారులు వీటిని స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారని ట్వీట్‌లో పేర్కొంది. ఆ జంతువులు "ఆగస్టు 31న ఈస్ట్ కమేంగ్ ప్రాంతంలో తిరుగుతూ కనిపించాయి. వీటిపై మానవత్వం చూపిస్తూ, ఈ నెల 7వ తేదీన చైనా అధికారులకు అప్పగించాం" అని ట్వీట్లో పేర్కొంది. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గించడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఓ వైపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతూనే, మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎమ్ నారావణే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Statement Issued by Indian Army's Eastern Command 

ముఖ్యంగా పాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉన్న కీలక ప్రాంతాలపై పట్టు కోసం ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్వాన్‌ లోయలో ఇరు దేశాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. పరిస్థితిని పునరుద్దరించడానికి ఇరుదేశాల నేతలు అనేక సార్లు చర్యలు జరుపుతున్నప్పటికీ ఈ సమస్య ఒక కొలిక్కి రావడం లేదు. ఫింగర్ గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొంగ్రుంగ్ నాలా తదితర ప్రాంతాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గత జూన్ లో చైనా దళాలతో పోరులో 20 మందికి పైగా భారత జవాన్లు అమరులైన తరువాత ఈ ప్రాంతంలో పరిస్థితులు క్షీణించాయి.