New Delhi, April 16: భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకూ పెరుగుతుందే తప్ప, ఇప్పట్లో తగ్గే సూచనలేమి కనిపించడం లేదు. నిన్న గురువారం రోజూవారీ పాజిటివ్ కేసులు 2 లక్షలు దాటగా, శుక్రవారం కూడా అదే ట్రెండ్ రిపీట్ చేస్తూ 2.17 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు భారత్ నమోదు చేసిన కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం. ఒకవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టినా, గతంలో కంటే ఎక్కువ తీవ్రతతో కేసులు నమోదవడం కలవర పెడుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి దిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో వారాంతపు కర్ఫ్యూలు, కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు పరిమితంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతులు జారీ అవుతున్నాయి.
పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు విధించే యోచనలో ఆయా ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణలో పరీక్షలు రద్దు చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాపై సమాచారం, సలహాలు మరియు ఫిర్యాదుల కోసం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
గత 24 గంటల్లో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 61,695 కేసులు ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ నుంచి 16,699 కేసులు, ఉత్తరప్రదేశ్ నుంచి 22,339 కేసులు, ఛత్తీస్ ఘర్ నుంచి 15,256, కర్ణాటక నుంచి 14,738, మరియు మధ్యప్రదేశ్ నుంచి 10,166 కేసులు వెలుగుచూశాయి.
తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,185 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,74,308 కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,18,302 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,25,47,866 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 15,69,743 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 87.80 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 10.98 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.22% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 2,17,353 new #COVID19 cases, 1,18,302 discharges and 1,185 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,42,91,917
Total recoveries: 1,25,47,866
Active cases: 15,69,743
Death toll: 1,74,308
Total vaccination: 11,72,23,509 pic.twitter.com/dQYtH8QCN6
— ANI (@ANI) April 16, 2021
ఏప్రిల్ 15 నాటికి దేశవ్యాప్తంగా 26,34,76,625 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 14,73,210 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 11.72 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 11,72,23,509 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.