Image Showing of Defence Minister Rajnath Singh & Army Cheif General Bipin Rawat | Photo - PTI

New Delhi, September 30:  దాదాపు రెండు నెలలుగా కాశ్మీర్ అంశాన్ని వేలెత్తి చూపుతూ అణుయుద్ధం వస్తుంది అంటూ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు, ఇక సరైన జవాబు ఇవ్వాలని భారత్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. పాక్ నేతలు ఎంతగా రెచ్చగొట్టినా, ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న భారత్, ఇక మాటలతో కాకుండా చేతలతో జవాబివ్వాలని భావిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఏకకాలంలో భారత రక్షణ శాఖ మంత్రితో సహ, త్రివిధ దళాలకు చెందిన ముఖ్యులు పాక్ వ్యాఖ్యల పట్ల స్పందించారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) నిన్న ఆదివారం రోజు మాట్లాడుతూ.. అణ్వస్త్రాలను దీటుగా ఎదుర్కోవడంలో భారత నావికాదళం దేశానికి ఉన్న రెండవ శక్తి సామర్థ్యం అని వ్యాఖ్యానించారు. భారత రక్షణ మరియు ఆర్థిక వ్యవస్థలో నావికాదళం అత్యంత ప్రాముఖ్యత గలది అని రాజ్‌నాథ్ తెలియజేశారు. భారత నేవీకి సంబంధించిన యుద్ధనౌక INS Vikramadityaలో ప్రయాణించిన ఆయన, దానికున్న విశేషాలను నౌకదళ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు.  (మా ఉగ్రవాదిని ఆదుకునే అవకాశం ఇవ్వండి! )

ఈ సందర్భంగా షిప్ డెక్ నుంచి మీడియం రేంజ్ మిషీన్ గన్ తో రెండు రౌండ్ల పాటు కాల్పులు ప్రాక్టీస్ చేశారు. పశ్చిమ తీరాన గల అరేబియా సముద్రంలో భారత నౌకదళానికి చెందిన జలాంతర్గాములు, యుద్ధ నౌకలు చేసిన విన్యాసాలను ఆయన వీక్షించారు.

మిషీన్ గన్ కాలుస్తున్న రాజ్‌నాథ్ సింగ్

పాక్ ను హెచ్చరించిన భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్:

మరోవైపు పాకిస్థాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) ఘాటుగా స్పందించారు. ఇకపై దాగుడు మూతలు ఏమి ఉండవు. 'నియంత్రణ రేఖ' కు ఉన్న గౌరవాన్ని పాకిస్థాన్ నిలుపుకోవాలి. 'హద్దు' మీరి ప్రవర్తిస్తే భారత ఆర్మీ కూడా సరిహద్దు దాటాల్సి వస్తుంది. అది భూమార్గమేనా, ఆకాశ మార్గమైనా ఎలాగైనా చొచ్చుకొస్తుంది అని రావత్ హెచ్చరించారు.  (అంతకు మించిన దాడులు చేస్తాం!)

పాకిస్థానీ ఉగ్రవాదులు వారి సైన్యానికి ప్రత్యామ్నాయంగా వ్యవహరిస్తారు. ఇకపై అలాంటి దాగుడు మూతలు ఏమి సాగవు, సరిహద్దు వెంబడి పాకిస్థాన్ చర్యలే ఇక దాని భవిష్యత్తును నిర్ణయిస్తాయని రావత్ స్పష్టం చేశారు.

మరోసారి 'బాలాకోట్' దాడులకు సిద్ధం:

మరోసారి బాలాకోట్ తరహా దాడులకు సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన చీఫ్ మార్షల్ బహదూరియ RKS Bhadauria సోమవారం నాడు స్పష్టం చేశారు. దేశ రక్షణకు సంబంధించి భారత వాయుసేన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది అని పేర్కొన్నారు. పాకిస్థాన్ అణుయుద్ధ వ్యాఖ్యలపై స్పందించిన బహదూరియా, "పాకిస్థాన్ కు అణు అంశాలపై అంతగా అవగాహన ఉంటే ఉండనీ, అణు శక్తికి వినియోగంపై భారత్ కు ఉండాల్సిన అవగాహన భారత్ కు ఉంది, ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధం" అని వెల్లడించారు, పాకిస్థాన్ కు ఎప్పుడు, ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసని బహదూరియ స్పష్టం చేశారు.