New Delhi, June 26: దేశంలో నిన్న తాజాగా 17,45,809 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 48,698 కరోనా కేసులు (COVID-19 in India) నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. 24 గంటల్లో 64,818 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,83,143కు చేరింది.ఇక మరణాల విషయానికొస్తే, నిన్న 1,183 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,94,493కు పెరిగింది. దేశంలో కరోనా (Coronavirus) నుంచి ఇప్పటివరకు 2,91,93,085 మంది కోలుకున్నారు. 5,95,565 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,83,143కి చేరింది.
గత కొంతకాలంగా గణనీయంగా తగ్గుతున్న క్రియాశీల కేసులు.. తాజాగా 6లక్షల దిగువకు చేరాయి. క్రియాశీల రేటు 1.97 శాతానికి తగ్గగా.. రికవరీరేటు 96.72 శాతానికి పెరిగింది. నిన్న 64,818 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.91 కోట్లకు చేరాయి. ఇదిలా ఉండగా.. రెండో దఫా వైరస్ విజృంభణ తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి కలవరపెడుతోంది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 48 డెల్టాప్లస్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొద్ది రోజులుగా కరోనా టీకా కార్యక్రమం వేగం పుంజుకుంది. నిన్న 61,19,169 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 31,50,45,926కి చేరింది.
దేశంలో వెలుగుచూస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌పై కోవిషీల్డ్, కొవ్యాక్సిన్లు ఎంతవరకూ ప్రభావవంతంగా పనిచేస్తాయనేది పరీక్షిస్తున్నామని, వారం పదిరోజుల్లో ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్ల సామర్ధ్యం ఏపాటిదో తెలుస్తుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బల్‌రాం భార్గవ పేర్కొన్నారు. గత వేరియంట్లపై చేసిన తరహాలోనే డెల్టా ప్లస్ పైనా వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని పరీక్షిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 48 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయని చెప్పారు.
గర్భిణులకు వ్యాక్సిన్ ఇవ్వచ్చని, ఇక చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రస్తుతం ఒకే ఒక్క దేశంలో చేపడుతున్నారని, చాలా పరిమిత సంఖ్యలో చిన్నారులకు వ్యాక్సిన్ అవసరమవుతుందా అనేది ప్రశ్నార్ధకంగానే ఉందని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసులు దిగివస్తున్నాయని, ఇప్పటివరకూ దాదాపు 30.79 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందించామని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం కేవలం 125 జిల్లాల్లోనే వందకు పైగా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. కొవిడ్-19 రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.