Covid Updates: ఒకే వ్యక్తిలో రెండు రకాల కరోనావైరస్‌లు, నివ్వెరపోతున్న శాస్త్రవేత్తలు, బ్రెజిల్‌లో పీ1, పీ2 కరోనా రకాలు గుర్తింపు, ఇండియాలో తాజాగా 11,039 మందికి కోవిడ్, ఏపీలో 104 మందికి కరోనా పాజిటివ్
Image used for representational purpose | (Photo Credits: Pixabay)

New Delhi, Feb 3: కరోనావైరస్ తొలుత విశ్వరూపం చూపించగా..ఆ తర్వాత తన రూపును మార్చుకుని కొత్త వేరియంట్ తో చుక్కలు చూపిస్తోంది. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ దాని భయం జాడలు ఇంకా పోలేదు. అయితే ఈ భయాన్ని మరింతగా ముందుకు తీసుకువెళుతూ బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ లు (Gene Mutation) వెలుగుచూశాయి. తాజాగా బ్రెజిల్ లో శాస్త్రవేత్తల అంచనాలకు అందని రీతిలో ఒకే వ్యక్తిలో రెండు కరోనావైరస్ కొత్త రకాలను (New Strain) గుర్తించారు. ఇలాంటి కేసులు బ్రెజిల్ లో రెండు నమోదయ్యాయి.

రెండు కరోనా రకాలు ఒకేసమయంలో సోకడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి డబుల్ కొవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు ఇవేనని భావిస్తున్నారు. దక్షిణ బ్రెజిల్ లోని రియో గ్రాండే సూల్ ప్రాంతంలోని 90 మంది కరోనా రోగుల తెమడను పరీక్షించిన ఫీవేల్ వర్సిటీ పరిశోధకులు ఈ డబుల్ ఇన్ఫెక్షన్ కేసులను గుర్తించారు. వారిలో ఏకకాలంలో రెండు కరోనా రకాలు పాజిటివ్ గా తేలాయి. ఓ వ్యక్తిలో వెల్లడైన రెండు కరోనా రకాలను బ్రెజిల్ లోనే రూపు మార్చుకున్న పీ1, పీ2గా గుర్తించారు.

వీటిలో పీ1 ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ అని భావిస్తున్నారు. ఇది వ్యాక్సిన్ కు కూడా లొంగకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకే వ్యక్తిలో ప్రవేశించిన రెండు కరోనా రకాలు పరస్పరం తమ జన్యుకోడ్ ను మార్చుకుని ప్రమాదకరంగా పరిణమించే అవకాశం లేకపోలేదని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు గల అవకాశాలు స్వల్పం అని తెలుస్తోంది.

జూలై 17వతేదీ వరకు లాక్‌డౌన్ పొడిగింపు, కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రభుత్వం, సందర్శకులు 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ

ఇక మన దేశంలో గత 24 గంటల్లో 11,039 మందికి కరోనా (India Covid Updates) నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,225 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,77,284 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 110 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,596 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,62,631 మంది కోలుకున్నారు. 1,60,057 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 41,38,918 మందికి వ్యాక్సిన్ వేశారు

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,309 కరోనా టెస్టులు నిర్వహించగా 104 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 27, కృష్ణా జిల్లాలో 25, చిత్తూరు జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 147 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,004 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,79,651 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,197 మందికి చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,156కి పెరిగింది.