Covid Updates: ఐసీయూలో శశికళ, కోవిడ్‌తో పోరాడుతున్న చిన్నమ్మ, సీరం అగ్ని ప్రమాదంలో రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం, దేశంలో తాజాగా 14,256 మందికి కోవిడ్ పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 221 కరోనా కేసులు నమోదు
COVID-19 Outbreak in India | File Photo

New Delhi, Jan 23: దేశంలో గడిచిన 24గంటల్లో 14,256 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు (COVID-19 in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,39,684కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 17,130 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. ఇప్పటి వరకు 1.03కోట్ల మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. మరో 152 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా.. మృతుల సంఖ్య 1,53,184కు (Covid Deaths) పెరిగిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 1,85,662 క్రియాశీల కేసులు ఉన్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 13,90,259 మందికి వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది.

త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ నాయ‌కురాలు శ‌శిక‌ళ (Former leader of the AIDMK, Shashikala) ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని బెంగ‌ళూరు మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. ఐసీయూ వార్డులో ప్ర‌త్యేక వైద్య బృందం చేత ఆమెకు చికిత్స కొన‌సాగుతోంద‌ని చెప్పారు. కాగా జ‌న‌వ‌రి 21వ తేదీన శ‌శిక‌ళ‌కు క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయిన విష‌యం విదిత‌మే. ఆమెకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మధుమేహం, రక్తపోటు కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అక్రమాస్తుల వ్యవహారంలో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. ఈ నెల 27న విడుదల కావాల్సి ఉన్నది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె విడుదల కానుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే ఇంతలో అస్వస్థతకు గురికావటం ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 137 కరోనా కేసులు నమోదు, 1488గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, కొనసాగుతున్న టీకాల పంపిణీ

ఇక అగ్ని ప్రమాదంలో తమకు రూ. 1000 కోట్లపైనే నష్టం వాటిల్లిందని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII) వెల్లడించింది. రోటావైరస్‌, బీసీజీ టీకాలను ఉత్పత్తి చేసే చోట ప్రమాదం సంభవించిందని సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా చెప్పారు. ప్రమాద స్థలాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని, ఇది నిజంగా ప్రమాదమా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 2,779 కరోనా కేసులు, 50 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,03,657కు, మరణాల సంఖ్య 50,684కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 3,419 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,06,827కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,926 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

అరవై దేశాలకు పాకిన యుకె కరోనావైరస్, 23 దేశాలకు పాకిన దక్షిణాఫ్రికా రకం కరోనావైరస్, వారంలోనే 47 లక్షల కరోనా కేసులు, కొవిడ్ వారపు నివేదికను విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,93,056కు చేరింది. ఇందులో 2,87,899 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3569 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 1,588 మంది మరణించారు. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 1973 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, శుక్రవారం రాత్రి 8 గంటలవరకు కరోనా వైరస్‌ వల్ల ఇద్దరు మరణించగా, 431 మంది బాధితులు మహమ్మారి బారినుంచి బయట పడ్డారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 36 కేసులు ఉన్నాయి.