Coronavirus in TS (Photo Credits: IANS)

New Delhi, Aug 22: దేశంలో గడిచిన 24 గంటల్లో 30,948 కొత్త కేసులు (Coronavirus in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. తాజాగా 38,487 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 403 మంది వైరస్‌ ప్రభావంతో మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,24,24,234 కు (COVID-19 Cases) పెరిగింది. ఇందులో 3,16,36,469 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 3,53,398 ఉన్నాయి. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 4,34,367 మంది ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 58,14,89,377 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 15,85,681 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. మొత్తం 50,62,56,239 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బూస్టర్‌ డోస్‌ (మూడో డోసు)పై చర్చ సాగుతున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా స్పందించారు. బూస్టర్‌ డోస్‌పై ప్రస్తుతం భారత్‌లో అవసరమైన డేటా లేదని, అయితే వచ్చే ఏడాది మొదట్లో సమాచారం అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. యూఎస్‌, యూకే, ఇజ్రాయెల్‌ సహా అనేక దేశాలు మహమ్మారిపై పోరాడేందుకు ప్రజలకు బూస్టర్‌ డోసులు వేయాలని యోచిస్తున్నాయి.

ఆగస్టు 25 వరకు దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఢిల్లీలో కేవలం మూడు గంటల్లో 73.2 సెంటీమీటర్ల వాన, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు

మూడో మోతాదుతో అధిక రక్షణ లభిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. భారత్‌లో డేటా ప్రస్తుతం బూస్టర్‌ డోస్‌ అవసరమని చెప్పడానికి ప్రస్తుతం తమ వద్ద తగినంత డేటా ఉందని అనుకోనని, వ్యాక్సిన్లు అందించే రక్షణపై పూర్తి డేటా ఉండాలన్నారు. ఇందుకు పరిశోధన అవసరమని, దీనికి మరికొద్ది నెలలు సమయం పడుతుందన్నారు. బహుశా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి బూస్టర్‌ డోస్‌ ఏంటి? ఎవరికి అవసరం? అనే డేటా అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్‌ చీఫ్‌ పేర్కొన్నారు.

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేసిన వ్యక్తులు తీవ్రమైన వ్యాధి నుంచి రక్షణ పొందడం చూస్తున్నామని, ఆసుపత్రుల్లో చేరే సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించడం లేదని డాక్టర్‌ గులేరియా అన్నారు. ఏదేమైనా ‘ఏదో ఒక సమయంలో బూస్టర్‌ డోస్‌ అవసరం కావొచ్చు’ అన్నారు. ‘అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల నుంచి మనకు ఇది అవసరమా? కొత్త వ్యాక్సిన్ కావాలా? వ్యాక్సిన్లను బూస్టర్‌గా కలపాలా? అనే సమాచారం వెలుగులోకి వస్తుందన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్‌లో భాగంగా 58కోట్లకుపైడా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.