New Delhi, September 21: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా దేశవ్యాప్తంగా 86,961 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదు అయ్యాయి. 24 గంటల్లోనే 1130 మంది వైరస్ వల్ల మరణించారు. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ( Coronavirus Outbreak in India) 54.87 లక్షలకు చేరుకున్నది. దీంట్లో యాక్టివ్ కేసులు 10,03,299 ఉన్నాయి. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 43,96,399గా ఉంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 87, 882గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 79.68 శాతంగా ఉండగా.. యాక్టీవ్ కేసుల సంఖ్య 18.72 శాతంగా ఉంది. ఇక మరణాల రేటు 1.61 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 7,31,534 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపగా.. ఇప్పటి వరకు మొత్తం 6,43,92,594 కోవిడ్ పరీక్షలు చేశారు.
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో 106 ఏళ్ల వృద్ధురాలు కోవిడ్-19 వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆ బామ్మకు ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది అత్యంత ఘనంగా వీడ్కోలు పలుకుతూ, ఇంటికి పంపించారు. ఆసుపత్రిలో 10 రోజుల పాటు చికిత్స పొందిన ఆ వృద్ధురాలు అత్యంత ఆనందంగా తన డిశ్చార్జ్ షీటును మీడియాకు చూపించారు. ఆ వృద్ధురాలి కోడలు మీడియాతో మాట్లాడుతూ డోంబివలీనివాసి అయిన తన అత్త కరోనా బారిన పడగా, ఆమె వయసును చూసి, ఏ ఆసుపత్రిలోనూ అడ్మిట్ చేసుకోలేదన్నారు. ఎంతో ప్రయత్నించిన మీదట 10 రోజుల క్రితం కణ్యాణ్ డోంబివలీ నగర్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నారన్నారు. అక్కడి వైద్యబృందం తన అత్తకు తగిన చికిత్స అందించారన్నారు.
ఈ సందర్భంగా కోవిడ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాహుల్ థులే మాట్లాడుతూ ఆ బాధిత వృద్దురాలికి చికిత్స అందించేందుకు తమ వైద్యబృందం ఎంతో కృషి చేసిందన్నారు. జూలై 27న ఈ ఆసుపత్రి ప్రారంభమయ్యిదని, ఇప్పటివరకూ 1,100 మందికి చికిత్స అందించామని తెలిపారు. కాగా కరోనా బారిన పడిన ఆ వృద్ధురాలికి వైద్యం అందించి, ఆమె కోలుకునేందుకు సహకరించిన వైద్యులకు మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభినందనలు తెలిపారు.