#COVID19 India Tracker | Photo: MIB

New Delhi, April 23: ప్రతిరోజూ లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు. నానాటికి తగ్గిపోతున్న రికవరీ రేటు, పెరుగుతున్న ఆక్టివ్ కేసుల సంఖ్య.. ఫలితంగా ఆసుపత్రుల్లో సౌకర్యాలు సరిపోక, ఔషధాలు లేక ఒకే బెడ్ మీద ముగ్గురికి చాలీచాలని చికిత్సలు, స్మశానవాటికల్లోనూ భారీగా క్యూలు. ఇదీ క్లుప్తంగా ప్రస్తుత భారతదేశ పరిస్థితి. దేశంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు.

కరోనా ఆందోళనల నేపథ్యంలో మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తన ఎన్నికల ర్యాలీలను విరమించుకున్నారు. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే పలు రాష్ట్రాల్లో నెలకొన్న ఆక్సిజన్ కొరత దృష్ట్యా మధ్యాహ్నం 12:30 గంటలకు ఆక్సిజన్ తయారీదారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు.

ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అన్ని రకాల ర్యాలీలను నిషేధించారు. అయితే సోమవారం నుంచి ప్రధాని మోదీ బెంగాల్ పర్యటన రీషెడ్యూల్ చేసినట్లు బీజేపీ ప్రకటించింది. ర్యాలీలు కాకుండా 500 మందికి మించకుండా చిన్న సభలను ఏర్పాటు చేస్తామని. ఈ సభల్లో ప్రధాని మోదీ సహా బీజేపీ జాతీయ నాయకులందరూ పాల్గొంటారని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే శుక్రవారం భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 3,32,730 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 67,013 కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి 34 వేలు, కేరళ నుంచి సుమారు 27 వేలు, కర్ణాటక నుంచి సుమారు 26 వేలు, దిల్లీ నుంచి 26 వేల కేసులు వెలుగుచూశాయి.

తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,63,695కు చేరింది. నిన్న ఒక్కరోజే 2,263 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,86,920కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,93,279 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,36,48,159 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 24,28,616 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 83.92 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 14.93 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.15% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఏప్రిల్ 22 నాటికి దేశవ్యాప్తంగా 27,44,45,653 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,40,550  శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 13.23 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 13,23,30,644 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి కూడా టీకా అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఏప్రిల్ 28 నుంచే కోవిన్ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.