India Coronavirus Update: బీజేపీ అగ్రనేతల్లో కరోనా కలవరం, బి.ఎస్.యడ్యూరప్పకు కరోనా పాజిటివ్, దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు, హోమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 పాజిటివ్
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, August 3: దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త అంత‌కంత‌కూ (India Coronavirus Update) పెరుగుతోంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే కొత్త‌గా మ‌రో 52,972 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 18,03,695గా న‌మోదైంది. ఇక మ‌ర‌ణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గ‌డిచిన 24గంట‌ల్లో మ‌రో 771 మంది కొవిడ్ రోగులు (Coronavirus India Deaths) మృత్యువాత‌ప‌డ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మ‌ర‌ణాల సంఖ్య 38,135కు చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమశాఖ వెల్ల‌డించింది. క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టికే 11ల‌క్ష‌ల 86వేల మంది కోలుకోగా మ‌రో 5ల‌క్ష‌ల 79వేల క్రియాశీల కేసులు ఉన్న‌ట్లు తెలిపింది. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ు రద్దు, ఆగస్టు 31 వరకు పొడిగించిన పౌర విమానయాన శాఖ, దేశంలో నాలుగు నగరాల పరిస్థితి ఆందోళనకరమన్న ఆరోగ్యమంత్రి

దేశ‌వ్యాప్తంగా వైర‌స్ తీవ్ర‌త పెరిగింది. గ‌డిచిన వారంరోజుల్లో దేశంలో 3ల‌క్ష‌ల 70వేల కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం క‌రోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు(డ‌బ్లింగ్ రేటు) 21రోజులు ప‌డుతున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. ఇదిలాఉంటే, ప్ర‌పంచంలో అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్న దేశాల జాబితాలో భార‌త్ మూడో స్థానంలో ఉంది. మ‌ర‌ణాల్లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది.

కరోనా బారినపడిన బీఎస్ యడియూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (77) (Karnataka CM B.S. Yediyurappa) కరోనా వైరస్ బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ సంక్రమించిన విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని సూచించారు. తనలో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు. తనకు కరోనా సోకినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నానని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు.

Here's B.S. Yediyurappa  Tweet

తనకు కరోనా సోకిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించి గంటలైనా గడవకముందే ఆయన కుమార్తె కూడా కరోనా బారినపడ్డారు. ఆ వెంటనే ఆమె బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. సీఎం కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం ఆరోగ్యంగా ఉన్నారని, నిపుణుల బృందం ఆయనను దగ్గరుండి పర్యవేక్షిస్తోందని మణిపాల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కరోనా బారినపడిన అమిత్ షా... పరీక్ష చేస్తే పాజిటివ్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Home minister Amit Shah) కరోనా బారినపడ్డారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనాకు సంబంధించిన ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో, కరోనా పరీక్ష చేయించుకున్నానని, దాంట్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, అయితే, డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవాళ్లందరూ దయచేసి ఐసోలేషన్ లో ఉండాలని అమిత్ షా సూచించారు.

Update by ANI

 మంత్రి బాబుల్ సుప్రియో స్వీయ నిర్బంధంలోకి

కరోనా బారినపడిన కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన మరో మంత్రి బాబుల్ సుప్రియో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తాను అమిత్ షాను కలిశానని, వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులకు దూరంగా గృహ నిర్బంధంలో ఉండనున్నట్టు తెలిపారు. పరీక్షలు చేయించుకుని రిజల్ట్ వచ్చేంత వరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉంటానని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

కరోనా బారినపడిన తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్

తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ (Tamilnadu Governor Bhanwarilal) ఆసుపత్రి పాలయ్యారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. గవర్నర్ భన్వరిలాల్ జూలై 29 నుంచి హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవలే తమిళనాడు రాజ్ భవన్ లో కరోనా కలకలం రేగింది. గవర్నర్ సిబ్బందిలో 84 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో గవర్నర్ భన్వరిలాల్ ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. తాజాగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరినట్టు అర్థమవుతోంది.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న అమిత్ షా

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. చివరిగా నిర్వహించిన కరోనా టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది. దాంతో అమితాబ్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అభిషేక్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. తన విషయం గురించి చెబుతూ, ఇతర లక్షణాల కారణంగా తాను కొంతకాలం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోందని మరో ట్వీట్ లో తెలిపారు. ఇప్పటికీ తనకు కరోనా పాజిటివ్ అనే వస్తోందని వివరించారు.

కరోనా వైరస్‌ సోకి ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి కమలారాణి మృతి

కరోనా వైరస్‌ సోకి ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి కమలారాణి మృతి (up minister kamala rani passes away) చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్‌ బారినపడిన ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. అయితే, లక్నోలోని సంజ‌య్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆమె మృతి చెందారని వైద్యులు ప్రకటించారు.

మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో కన్నుమూత

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు (pydikondala manikyala rao Passes Away) కరోనా వల్ల కన్నుమూసిన సంగతి విదితమే. కరోనా బారిన పడిన ఆయన... నెల క్రితం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకున్నారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి పట్ల సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు, బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఏపీ సీఎం ఆదేశాల మేరకు మాజీ మంత్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు.