COVID19 in India: భారత్‌లో 150 రోజుల కనిష్ఠానికి చేరుకున్న ఆక్టివ్ కేసుల సంఖ్య, గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా కొత్తగా 36,571 పాజిటివ్ కేసులు మరియు 540 మరణాలు నమోదు
COVID19 Outbreak in India | Photo: ANI

New Delhi, August 20: భారత్‌లో రోజూవారీ కోవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి, గడిచిన వారం రోజులుగా సగటున రోజుకు 35 వేల కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే రికవరీ రేటు చాలా వరకు మెరుగుపడిందని, ప్రస్తుతం 97.54 శాతానికి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆక్టివ్ కేసులు 150 రోజుల కనిష్ఠానికి చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు కేరళ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల్లో ఏమాత్రం కనిపించడం లేదు. గడిచిన 24 గంటల్లో కేరళలో 21,116 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 36,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,23,22,428కు చేరింది. నిన్న ఒక్కరోజే 540 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,33,589  కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,555 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,15,61,635 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,63,605 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.54% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.12 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఆగష్టు 19 నాటికి దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 50 కోట్లు దాటినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు 50,26,99,702 టెస్టులు చేయగా, నిన్న ఒక్కరోజే 18,86,271 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 54,71,282 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 57.22 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 57,22,81,488 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.