PM Modi gets 2nd shot of vaccine | Photo: ANI

New Delhi, April 8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో మోతాదు టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'కోవిడ్ మహమ్మారిని ఓడించే మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటి. ఈరోజు నేను నా యొక్క రెండో డోస్ టీకా తీసుకున్నాను. దేశంలో అర్హులైన వారందరూ టీకా తీసుకోవాలని నేను కోరుతున్నాను' అని మోదీ పేర్కొన్నారు. మార్చి 1న మోదీ తన తొలి డోసు టీకా 'కోవాగ్జిన్' తీసుకున్నారు.

ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ విజృంభనతో దేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు అంచనా వేసేందుకు మరియు వ్యాక్సినేషన్ డ్రైవ్, ఇతర నివారణ చర్యలు కొనసాగుతున్న తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఆన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ గా సమావేశంకానున్నారు.

ఇక గత 24 గంటల్లో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,26,789 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 59,907 కేసులు ఉన్నాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,29,28,574కు చేరింది. నిన్న ఒక్కరోజే 685 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,66,862కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 59,258 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,18,51,393 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 9,10,319 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 91.67 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 7.04 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.29% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఏప్రిల్ 7 నాటికి దేశవ్యాప్తంగా 25,26,77,379 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 12,37,781 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 9.1 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 9,01,98,673మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.