India Coronavirus: మళ్లీ వారం రోజుల పాటు లాక్‌డౌన్, నేటి రాత్రి నుంచి మార్చి 1 వరకు మహారాష్ట్రలో ఏడు జిల్లాల్లో లాక్‌డౌన్ అమలు, మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు కరోనా, దేశంలో తాజాగా 14,199 కొత్త కేసులు, ఏపీలో 88 మందికి కోవిడ్
COVID-19 lockdown (Photo Credit: PTI)

New Delhi: దేశంలో గత 24 గంటల్లో 14,199 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 9,695 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,05,850కు (India Coronavirus) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 83 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,385కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,99,410 మంది కోలుకున్నారు.

1,50,055 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,11,16,854 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,15,51,746 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,20,216 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,680 కరోనా పరీక్షలు నిర్వహించగా 88 మందికి కరోనా పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 21 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 19, విశాఖ జిల్లాలో 11 కేసులు గుర్తించారు. కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 72 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,89,298 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,511 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 620 మందికి చికిత్స జరుగుతోంది. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 7,167గా నమోదైంది.

కరోనా రోగులపై మళ్లీ కొత్త స్ట్రెయిన్లు దాడి, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కష్టమని తెలిపిన ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, ఆరు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాప్తి

మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు (Maharashtra Minister Chagan Bhujbal) సోమవారం కరోనా సోకింది.‘‘నేను సోమవారం చేయించుకున్న పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని వచ్చింది. గత రెండు మూడు రోజులుగా నాతో కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి.నా ఆరోగ్యం బాగానే ఉంది, ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు, పౌరులందరూ జాగ్రత్తలు తీసుకోండి’’ అని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్‌బల్‌ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు

మహారాష్ట్రలో మళ్లీ కేసులు పెరుగుతుండడంతో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్‌‌ జిల్లాలలో వారం రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. నేటి రాత్రి నుంచి మార్చి 1 వరకు ఇది అమల్లో ఉంటుంది.అలాగే నేటి నుంచి పూణె, నాసిక్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. శుక్రవారం నాడు పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు. విద్యాసంస్థలను కూడా ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్‌, డిసెంబర్‌లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా

గత రెండు వారాల్లో కేసులు 2,500 నుంచి ఏడు వేలకు పెరిగాయని, పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్ర వ్యాప్త లాక్‌డౌన్‌పై ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సీఎం హితవు పలికారు.

ఇక జాల్నా జిల్లాలోని ఒక ఆలయంలోని సిబ్బంది, ఆలయం వెలుపలు ఉన్నవారు మొత్తం 55 మందికి కరోనా సోకిందని తేలడంతో జిల్లా అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ జయదేవ్ వాడిలోని జాలీచాదేవి మందిరం ఉందని, అక్కడ పూజలు నిర్వహించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారని తెలిపారు. తాజాగా ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 55 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో ఆలయాన్ని మూసివేశామన్నారు. ఆలయం వెలుప బారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆలయ రహదారిలో రాకపోకలు కూడా నిలిపివేశామని తెలిపారు

.