New Delhi, Jan 16: దేశంలో గడిచిన 24గంటల్లో 15,158 పాజిటివ్ కేసులు (Covid in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,42,841కు చేరింది. వైరస్ నుంచి 16,977 మంది తాజాగా కోలుకోగా.. ఇప్పటి వరకు 1,01,79715 మంది డిశ్చార్జి అయినట్లు తెలిపారు. మరో 175 మంది మహమ్మారికి బలవగా.. మృతుల సంఖ్య 1,52,093కు పెరిగింది.
ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం 2,11,033 క్రియాశీల కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 8,03,090 టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు 18,57,65,491 నమూనాలను పరిశీలించినట్లు చెప్పింది.
గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 249 పాజిటివ్ కేసులు (New COVID-19 Cases in TS) నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 54 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో ఒకరు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,91,367కి పెరిగింది. మొత్తం 1,575 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,273 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ కేసులలో 2,381 మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఓవైపు కరోనా వైరస్ నుంచి ఇంకా కోలుకోకముందే... దాన్నుంచి పుట్టుకొస్తున్న కొత్త స్ట్రెయిన్ లు ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయి. యూకే, సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ లు కలకలం సృష్టిస్తున్నాయి. యూకే స్ట్రెయిన్ ప్రపంచంలోని అనేక దేశాలకు పాకుతున్న నేపథ్యంలో యూఏఈలో సైతం మరో రకం కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు. యూకే స్ట్రెయిన్ కేసులను పరిశీలిస్తున్న క్రమంలోనే మరికొన్ని జన్యుమార్పిడిలతో ఈ కొత్తరకం వైరస్ వెలుగులోకి వచ్చిందని యూఏఈ వైద్య నిపుణులు తెలిపారు.
కొత్త స్ట్రెయిన్ కు ప్రస్తుత కరోనా పేషెంట్లకు కొనసాగిస్తున్న చికిత్స, టీకా పద్ధతినే కొనసాగిస్తే సరిపోతుందని యూఏఈ నేషనల్ కోవిడ్-19 క్లినికల్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్ పర్సన్ డాక్టర్ నవల్ అల్ కాబి తెలిపారు. అయితే మామూలు కరోనా వైరస్ తో పోలిస్తే ఈ కొత్త స్ట్రెయిన్ విస్తరణ వేగంగా ఉందని చెప్పారు