New Delhi, Jan 4: కరోనావైరస్ కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 16,505 మందికి కరోనా నిర్ధారణ (Covid in India) అయింది. అదే సమయంలో 19,557 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,03,40,470కు (COVID-19 Cases in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 214 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,649కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,46,867 మంది కోలుకున్నారు. 2,43,953 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌లో అన్ని కరోనా కేర్ సెంటర్లను మూసివేస్తూ (Corona Care Centers Closed) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని భోపాల్‌లోని (Bhopal) సెంటర్‌ను మాత్రమే కొనసాగించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గిందని, దీంతో ఆయా కేంద్రాల్లో పడకలు ఎక్కువ శాతం ఖాళీగా ఉంటున్నందున మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచే అన్ని కొవిడ్ కేర్ సెంటర్లను మూసివేశారు.
దీనిని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో ఇంకా కరోనా మరణాలు సంభవిస్తున్నాయని, మహమ్మారి భయంతో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. అయితే ప్రస్తుతం కరోనా నియంత్రణలోనే ఉందని, ఒకవేళ కేసులు ఎక్కువగా నమోదైతే తిరిగి ఈ కేంద్రాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చామని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ (MP Chief Minister Shivraj Singh Chauhan) తెలిపారు.
ఇక ముంబైలో 581 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,95,241కి చేరగా, ఇప్పటివరకు 11,135 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఐఎస్ చాహల్ మహానగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని కట్టడిచేయడానికి వారు అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు. వైరస్‌పై ముందుండి పోరాడిన డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.