Coronavirus Outbreak. | (Photo-PTI)

New Delhi, Oct 3: దేశంలో గత 24 గంటల్లో 22,842 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,13,903కు చేరింది. ఇందులో 3,30,94,529 మంది కోలుకోగా, 4,48,817 మంది బాధితులు మృతిచెందారు. మరో 2,70,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో యాక్టివ్‌ కేసులు 199 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో 25,930 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 244 మంది (244 deaths in the last 24 hours) చనిపోయారని తెలిపింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 13,217 కేసులు ఉన్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో మరో 121 మంది కరోనాకు బలయ్యారని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 90,51,75,348 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ (Covid Vaccination) డోస్‌ల సంఖ్య 90 కోట్ల మైలురాయిని దాటింది. కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సిన్‌ వేసిన ప్రభుత్వం, మార్చి 1వ తేదీ నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించిన తర్వాత డ్రైవ్‌ వేగం పుంజుకుంది. గత 259 రోజుల్లో 90 కోట్లకు పైగా డోస్‌లను అందించారు. వీటిలో సెపె్టంబర్‌ 17న ప్రధాని మోదీ పుట్టినరోజున అత్యధికంగా 2.50 కోట్ల డోసులను ప్రజలకు అందించారు. కాగా దేశంలో మొట్టమొదటిసారిగా ఆగస్టు 27న రోజువారీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 1 కోటి దాటింది. దేశంలోని 47.3%మందికి తొలిడోస్, 17.4% మందికి రెండు డోస్‌లను వేశారు.

అమెరికాపై మళ్లీ కరోనా పంజా, ఏడు ల‌క్ష‌లు దాటిన మృతుల సంఖ్య, గ‌డిచిన 108 రోజుల్లో లక్షకు పైగా మరణాలు, యుఎస్‌ని వణికిస్తున్న డెల్టా వేరియంట్

ఏడు రోజుల్లో ప్రపంచంలో 8 వేల మంది కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌ కారణంగా మరణించారు. అంటే, ప్రతి 5 నిమిషాలకు ఒకరు కరోనాతో మరణిస్తున్నారు. గత ఏడు రోజుల్లో ప్రపంచ సగటు మరణాలలో సగానికి పైగా అమెరికా, రష్యా, బ్రెజిల్, మెక్సికో, భారత్‌ల్లో నమోదయ్యాయి. అయితే గత కొన్ని వారాలుగా ప్రపంచంలో కరోనా మరణాల రేటు తగ్గింది. ప్రపంచంలో కరోనా సంక్రమణ కారణంగా అత్యధిక మరణాలు అమెరికాలోనే సంభవించాయి. అక్కడ 7.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా అమెరికాలో ఇప్పటివరకు సుమారు 56.1% మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తిచేశారు. అదే సమయంలో శుక్రవారం, రష్యాలో కరోనా కారణంగా 887 మరణాలు నమోదయ్యాయి. ఇది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక రోజులో అత్యధికం. భారత్‌లో కరోనా రెండో వేవ్‌ సమయంలో, డెల్టా వేరియంట్‌ కారణంగా రోజుకు సగటున 4వేల మరణాలు సంభవించాయి, అయితే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ వేగం అందుకున్న తర్వాత ఈ సగటు కేవలం 300 కి తగ్గింది.