Covid Second Wave in India: ఇండియాలో సెకండ్ వేవ్, దేశంలో తాజాగా 24,492 మందికి కరోనా నిర్ధారణ, సెకండ్ వేవ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రం, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17న సీఎంలతో వర్చువల్ సమావేశం కానున్న ప్రధాని మోదీ
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, March 16: దేశంలో గత 24 గంటల్లో 24,492 మందికి కరోనా నిర్ధారణ (India reports 24,492 new COVID-19 cases) అయింది. 20,191 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,09,831కు (India coronavirus news) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 131 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,856కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,27,543 మంది కోలుకున్నారు. 2,23,432 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 3,29,47,432 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,82,80,763 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,73,350 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ (Covid Second Wave) ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో కొత్త కేసులు నమోదుపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని... అది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.

గబ్బిలాల నుండే కరోనావైరస్ వ్యాపిస్తోంది, సార్స్-కోవ్-2 వైరస్‌‌లో అనేక జన్యు రూపాలు, సంచలన విషయాలను వెల్లడించిన స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్‌ వైరస్‌ రీసెర్చ్‌ టీం

కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని లేఖలో మహా ప్రభుత్వాన్ని రాజేశ్ భూషణ్ హెచ్చరించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనాను గుర్తించడం, టెస్టింగ్, ఐసొలేషన్ (ట్రాక్, టెస్ట్, ఐసొలేట్) వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపట్టడం లేదని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తోందని... అయితే, దీనికి తగ్గట్టుగా గట్టి చర్యలను తీసుకోవడం లేదని పేర్కొన్నారు. 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నారో... ఇప్పుడు మళ్లీ అలాంటి చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు.

ఇక దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నెల 17న వర్చువల్ విధానంలో సీఎంలతో సమావేశం నిర్వహించనున్నారు. కొత్త కేసుల సంఖ్య వృద్ధి, కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై వారితో చర్చించనున్నారు.

మళ్లీ డేంజర్ బెల్స్..నిన్న 25 వేలు కాగా నేడు 26 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో చేయి దాటుతున్న పరిస్థితి, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే

బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్ పై సీఎంల అభిప్రాయాలు అడిగి తెలుసుకోనున్నారు. కాగా, కరోనా మళ్లీ తీవ్రతరం అవుతుండడంతో మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలు కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్, రాత్రివేళ కర్ఫ్యూలు విధిస్తున్నాయి.