 
                                                                 New Delhi, May 4: దేశంలో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,57,229 కొత్త కరోనా పాజిటివ్ కేసులు (India Covid Update) నమోదు అవగా 3,449 మంది మృతి చెందారు. 24 గంటల్లో 3,20,289 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 2,02,82,833కి చేరగా...కోలుకున్న వారి సంఖ్య 1,66,13,292గా ఉంది. అలాగే ప్రస్తుతం 34,47,133 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,22,408గా (Covid Deaths) ఉంది. ఇప్పటి వరకు 15,89,32,921 మంది కోవిడ్ టీకా తీసుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
ముంబై మహానగరంలో దాదాపు ఐదు వారాల తరువాత రోజువారీ కేసుల (Mumbai Coronavirus) సంఖ్య గణనీయంగా తగ్గింది. సోమవారం నాడు 2,624 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో రోజువారీ టెస్టుల సంఖ్య కూడా 50 వేల నుంచి 38 వేలకు తగ్గిందని అధికార గణాంకాలు వెల్లడించాయి. ఇక, నగరంలో నిన్న 68 మంది కన్నుమూయగా, మొత్తం మరణాల సంఖ్య 13,372కు పెరిగింది.
ఈ సంవత్సరం మార్చి 17న ముంబైలో 2,377 కొత్త కేసులు వచ్చాయి. ఆపై కేసుల సంఖ్య క్రమంగా పెరిగింది. రెండో దశ ప్రమాదకరంగా విస్తరించింది. ఓ దశలో రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పెరిగాయి. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్, దేశమంతా ప్రభావం చూపింది. దేశంలోనే అత్యధికంగా నష్టపోయిన నగరంగా ముంబై నిలిచింది.
గత నెలలో మహారాష్ట్రలో (Maharashtra Coronavirus) ఒకరోజు కేసుల సంఖ్య 60 వేలను దాటిందంటే పరిస్థితి ఎంత తీవ్రతరమైందో అర్థం చేసుకోవచ్చు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 48,621 కొత్త కేసులు రాగా, 59,500 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలి కాలంలో కొత్త కేసుల కన్నా డిశ్చార్జ్ లు అధికంగా నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ నిబంధనల కారణంగానే కేసుల సంఖ్య అదుపులోకి వచ్చిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇదిలావుండగా, ముంబై తరువాత ఇప్పుడు పుణె ఆ స్థానాన్ని ఆక్రమించింది. పుణెలో ఒకరోజు కేసులు నిన్న 7,718కు పెరిగాయి. ఆ తరువాతి స్థానంలో 5,350 కేసులు నాగపూర్ లో నమోదయ్యాయి.
దేశంలో గడచిన 14 రోజుల్లో కరోనా మరణాలు (CoronavirusDeaths in India) భారీగా పెరిగాయి. న్యూయార్క్ టైమ్స్ కోవిడ్ ట్రాకర్ ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 3,417 మరణాలు నమోదవుతున్నాయి. నాలుగు వారాల క్రితం ప్రతిరోజూ 787 మరణాలు మాత్రమే నమోదయ్యేవి. భారతదేశంలో కరోనా సెకెండ్ వేవ్ గురించి శాస్త్రీయ అంచనాలు కూడా ఖచ్చితమైన పరిస్థితిని నిర్ధారించలేకపోతున్నాయి. ఏప్రిల్ మధ్యకాలంలో లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం జూన్ మొదటి వారం నాటికి దేశంలో ప్రతిరోజూ రెండున్నర వేల మందికి పైగా కరోనా బాధితులు మరణించవచ్చని అంచనా ఉంది.
అయితే ఏప్రిల్ 27 నాటికే భారతదేశంలో రోజువారీ మరణాల సంఖ్య మూడు వేలు దాటింది. భారతదేశంలో గత 14 రోజులలో కరోనా కేసులు 82 శాతం మేరకు పెరిగాయి. నాలుగు వారాల క్రితం భారతదేశంలో సగటున 1,43,343 కరోనా కేసులు నమోదుకాగా, ప్రస్తుతం ఈ సంఖ్య 3,68,647కు చేరింది. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఫిబ్రవరి 15 తర్వాత ప్రారంభమైంది. ఆ తేదీ వరకు కరోనా పాజిటివిటీ రేటు 1.60 శాతం మాత్రమే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఈ రేటు గరిష్టంగా 10 శాతంగా ఉండాలని, అది దాటితే పరిస్థితి తీవ్రతరం అవుతున్నదని గ్రహించాల్సివుంటుంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
