COVID19 in India: భారత్‌లో కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అదుపులో ఉన్న కోవిడ్ వ్యాప్తి; దేశంలో కొత్తగా 30,570 కోవిడ్ కేసులు, 431 మరణాలు నమోదు మరియు 38,303 మంది రికవరీ
COVID19 Outbreak in India | Photo: ANI

New Delhi, September 16: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రోజూవారీ కోవిడ్ కేసులు నిన్నటి కంటే ఈరోజు పెరిగాయి, అయితే వరుసగా ఏడవరోజు 30 వేల లోపే కొత్త కేసులు నమోదవడం గమనార్హం. ఇక, కేరళలో ఎప్పట్లాగే కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది, ఇప్పటికీ పెద్ద మొత్తంలో కేసులు ఆ రాష్ట్రం నుంచే ఉన్నాయి. కానీ గత వారం రోజుల యావరేజీని పరిశీలిస్తే కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తాజా నివేదిక తెలిపుతుంది. మరోవైపు చిన్న రాష్ట్రమైన మిజోరాంలో కోవిడ్ తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మిజోరాంలో

1,402 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ప్రస్తుతం మిజోరాం రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికంగా 17.43% గా ఉండి, ఆక్టివ్ కేసుల సంఖ్య 14 వేలకు చేరువలో ఉన్నాయి. గడిచిన వారం రోజులుగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం మరియు జమ్మూకాశ్మీర్ మినహా, దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సగటు తగ్గింది.

ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 30,570 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 431 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 17,681 కేసులు, 208 మరణాలు ఉన్నాయి.

తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,33,47,325 కు చేరింది, అలాగే ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,43,928కు పెరిగింది.

ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,303 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,25,60,474 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,42,923 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.64% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.03 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.33% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

సెప్టెంబర్ 15 నాటికి దేశవ్యాప్తంగా  54,76,35,557 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 15,79,761 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 64,51,423 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 76.57 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 76,57,17,137 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 57.86 కోట్లు ఉండగా, 18.70 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.